ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయం వచ్చింది .. రోడ్డెక్కండి… ఏం జరిగినా జగనన్న మీ వెనుకన్నాడు అని జగన్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఇది పార్టీ కార్యకర్తల్ని ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు. ఎందుకంటే.. ఇప్పటి వరకూ జైలుకెళ్లిన కార్యకర్తలకు బెయిల్ ఇప్పించే దిక్కు కూడా లేకుండాపోయింది. వారాల తరబడి చాలా మంది జైళ్లలో మగ్గిపోతున్నారు. వారి కోసం కనీసం న్యాయపోరాటం అయినా చిత్తశుద్ధితో చేయడం లేదు. చాలా కేసుల్లో బెయిల్స్ వచ్చే అవకాశం ఉన్నా సరైన న్యాయసాయం లేక ఇంకా జైళ్లలో మగ్గిపోయే వైసీపీ కార్యకర్తలు ఉన్నారు.
ఇటీవల ఓ సోషల్ మీడియా కార్యకర్త అరెస్టయ్యాడు. ఆయన టీడీపీ జెండాలతో టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేశాడు. అయితే అది సోషల్ మీడియా నిరసన అని కవర్ చేసుకున్నారు. ఆయనను అరెస్టు చేయడంతో వెంటనే కుటుంబసభ్యులను పిలిచి ఓదార్చినట్లుగా వీడియో రిలీజ్ చేశారు, ఆయనకు బెయిల్ ఇప్పించే ప్రయత్నాలు చేయకపోవడంతో జైల్లోనే ఉన్నారు. ఇలాంటి వారు ఉన్నారు. ఎలాగోలా జైలు నుంచి వచ్చిన తర్వాత వారికి అసలు టార్చర్ ఉంటోంది.
పోలీస్ రికార్డుల్లోకి.. కేసుల్లోకి..జైలు రికార్డుల్లోకి వారి పేర్లు ఎక్కడంతో నిరంతరం నిఘాలో ఉంటున్నారు. మరో తప్పు చేస్తే హిస్టరీ షీటో.. రౌడీ షీటో ఓపెన్ చేస్తారన్న భయం వారిలో వెంటాడుతోంది. అలాంటివి జరిగితే ఇక జీవితం నాశనం అయిపోతుంది. ఉద్యోగాలు, చదువులపై ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. ఇలా ఎంతో మంది కేసుల వలలో పడ్డారు. అలాంటి వారికి పార్టీ పరంగా న్యాయసాయం చేయడానికి కూడా అ వ్యవస్థ లేదు. అయినా నమ్మిన కార్యకర్తలను రెచ్చగొట్టి.. రోడ్లపై పంపడానికి జగనన్న మీ వెనక ఉన్నాడని ప్రకటనలు మాత్రం చేస్తున్నారు.