పుష్ప ఇష్యూ అటు తిరిగి, ఇటు తిరిగి టాలీవుడ్ పై పడింది. స్పెషల్ షోలకూ, రాయితీలకూ ఇకపై అనుమతి ఇవ్వబోయేదే లేదంటూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేయబోతున్నాయి. నిర్మాతలు సినిమాలు తీసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, రాయితీలు అందుకోండి – అంటూనే ప్రాణాలు పోయే సందర్భాలు వస్తే మాత్రం ఉపేక్షించేది లేదని, మినహాయింపులు ఉండవని, తాను సీఎంగా ఉన్నంత కాలం ప్రజల్ని రక్షించడమే తన బాధ్యత అని.. సీఎం అసెంబ్లీలో ఆవేశంగా మాట్లాడిన తీరు చూస్తుంటే, ఇకపై తెలంగాణ ప్రభుత్వానికీ, టాలీవుడ్ కీ మధ్య సయోధ్య కుదరడం కష్టమే అనిపిస్తోంది. టాలీవుడ్ కు ఏం కావాలన్నా, ఇదివరకటిలా స్వేచ్ఛగా అడగలేని పరిస్థితులు ‘పుష్ప 2’ వల్ల వచ్చాయి.
సంధ్య ధియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం, ఓ మహిళ మృతి చెంది, మరో పిల్లాడు కోమాలోకి వెళ్లి, ప్రాణాలతో పోరాడడం కలకలం సృష్టించింది. ఈ ఇష్యూలోనే అల్లు అర్జున్ అరెస్టయ్యాడు. ఇప్పుడు బెయిల్ పై వచ్చాడు. అయితే బెయిల్ పై బయటకు రాగానే టాలీవుడ్ మొత్తం బన్నీ ఇంటి ముందు క్యూ కట్టింది. ఆ కార్యక్రమాన్ని లైవ్ ఇవ్వడం పట్ల చాలామంది నొసలు చిట్లించారు. బన్నీని కలిసిన సందర్భంలో స్టార్లు హాయిగా నవ్వుకోవడం, అదేదో… సినిమా సెలబ్రేషన్ ఈవెంట్లా మారిపోవడం పట్ల కొంత విమర్శ చెలరేగింది. ఈ ఇష్యూని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరింత సీరియస్ గా తీసుకోవడానికి కారణభూతమైంది. అంతేకాదు… టాలీవుడ్ లోని ప్రముఖులు బన్నీని కలవడం ప్రభుత్వ దృష్టిలో పడింది. ఓ మహిళ చనిపోయి, మరో కుర్రాడు ప్రాణాలతో పోరాడుతుంటే సెలబ్రేషన్స్ చేసుకొంటారా? అంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తడానికి కారణం అదే. ఇదే సందర్భంగా తనకు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని, ఇలాంటి ఘటనలు జరిగి, ప్రజల ప్రాణాలు పోతే, ఉపేక్షించేది లేదని, అనుమతులు రాయితీల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడం టాలీవుడ్ కి పెద్ద దెబ్బ.
ఈ సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు వస్తున్నాయి. వాటికి ప్రీమియర్ షో అనుమతులు తెచ్చుకోవాలని నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తారు. అయితే ‘పుష్ప 2’ ఉదంతాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని అనుమతులు ఇవ్వడానికి నిరాకరించడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు.. టికెట్ రేట్లు పెంచుకొనే విషయంలోనూ ప్రభుత్వం అంత ఈజీగా సహకారం అందివ్వకపోవొచ్చు. ఇక రాయితీలూ, ప్రభుత్వం తరపున ఇచ్చే అవార్డుల గురించి మాట్లాడుకోవడం అనవసరం. కేసీఆర్ ప్రభుత్వం చిత్రసీమతో బాగానే ఉండేది. ఆ హయాంలోనే అవార్డులు రాలేదు. అలాంటిది రేవంత్ రెడ్డి హయాంలో అవార్డుల గురించి ఆశిస్తే భంగపాటు తప్పదు.