ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు చేసుకోవచ్చు కానీ భౌతిక దాడులకు దిగడం మాత్రం సమర్థనీయం కాదు. అల్లు అర్జున్ ఇంటిపై సంబంధం లేని వ్యక్తులు చేసిన దాడి ఖచ్చితంగా సహించరానిది. మరోసారి ఎవరూ అలాంటి దాడులకు ప్రయత్నించకుండా వారికి బుద్ది చెప్పాల్సి ఉంది. వివాదం నడుస్తూండగా.. ఈయూ జేఏసీనో.. మరో సంఘం పేరుతోనో ఇలా ఇళ్లల్లోకి చొరబడటం అనేది అత్యంత దారుణమైన విషయం.
ఇది శాంతిభద్రతలకు సంబంధించిన విషయం కూడా. ఓ ప్రైవేటు ప్రాపర్టీలోకి వెళ్లి ఆస్తి నష్టం చేయడం.. బెదిరించడం చిన్న విషయం కాదు. అల్లు అర్జున్ ఇంట్లో హంగామా చేసిన వారు ఇలాంటి పనుల్లో నిష్ణాతులుగా ఉన్నట్లుగా ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంట కాగడం వారికి వెన్నతో పెట్టిన విద్య అని వెలుగులోకి వచ్చిన వారి ఫోటోలే వెల్లడిస్తున్నాయి. వారి దాడుల వెనక ఇతర పెద్దలు ఉంటారో ఉండరో కానీ.. ఓ కుట్ర పూరితంగానే ఈ దాడులు చేశారని అర్థం చేసుకోవచ్చు.
పోలీసులు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుని స్పష్టమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపాల్సి ఉంది. ఇలాఎవరి ఇంటిమీదకైనా వ్యక్తులు వెళ్తే కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారికి చూపించాలి. లేకపోతే రేపు మరికొంత మంది అదే పని చేస్తారు. అప్పుడు పోలీసులకు కూడా ఎక్కువ సమస్యలువస్తాయి.