ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు రోజుల చైనా పర్యటన ముగించుకొని నిన్న రాత్రి డిల్లీ చేరుకొన్నారు. ఆయన చైనా పర్యటనలో రాష్ట్రానికి చాలా పెట్టుబడులు సాధించగలిగారని వార్తలు వచ్చేయి. ఎం.ఓ.యు.ల వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకొన్నట్లయితే ఆయన పర్యటన విజయవంతం అయినట్లే చెప్పుకోవచ్చు. కానీ వాటిలో ఎన్ని కార్యరూపం దాల్చుతాయో చూడాలి. అప్పుడే ఆయన చైనా పర్యటన సఫలం అయ్యిందా లేదా ఖచ్చితంగా తెలుస్తుంది. చైనా పర్యటన ముగిసింది కనుక ఇక అది గడిచిన అధ్యాయం క్రిందే లెక్క.
ఇవ్వాళ్ళ ఆయన కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీతో మొదట సమావేశం అవుతారు. ఆ తరువాత కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమా భారతితో సమావేశం అవుతారు. జైట్లీతో నిధుల విడుదల గురించి, ఉమా భారతితో బహుశః కృష్ణా జలాల పంపకాలపై తెలంగాణా ప్రభుత్వంతో జరుగుతున్న గొడవల గురించి, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలు చర్చిస్తారు.
ఈ రెండు విషయాలలో ఏమైనా ఫలితాలు కనబడుతాయా లేదా అనేది సందేహమే. ఎందుకంటే రాష్ట్రానికి విడుదలైన నిధుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలు ఎక్కడా పొంతాన లేకుండా ఉన్నాయి. కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని తెదేపా నేతలు ఆరోపిస్తుంటే వాటిని రాష్ట్ర భాజపా నేతలు గట్టిగా ఖండిస్తున్నారు. ఇంతవరకు ఇచ్చిన నిధులకి లెక్కలు చెప్పమని అడుగుతున్నారు. వారి వాదోపవాదాలు ఎడతెగకుండా సాగుతూనే ఉన్నాయి. కనుక చంద్రబాబు కోరగానే ఆర్ధికమంత్రి జైట్లీ నిధులు విడుదల చేస్తారనే నమ్మకం లేదు.
పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, దానిని కేంద్రమే నిర్మించడానికి బాధ్యతా వహిస్తున్నప్పటికీ, దాని పనులు కొనసాగించడానికి గడువు ఈ నెలతో పూర్తవడంతో దానిని పెంచవలసిందిగా చంద్రబాబు కేంద్రమంత్రి జవదేకర్ ని కోరవలసిన దుస్థితి నెలకొని ఉంది. అది సాంకేతిక సమస్యే కావచ్చు కానీ అది ఆ ప్రాజెక్టు పురోగతి ఏవిధంగా ఉందో అద్దం పడుతోంది. ఈ ప్రాజెక్టుపై కూడా తెదేపా-భాజపా నేతల మద్య చాలా వాదోపవాదాలు సాగుతున్నాయి. కనుక దీని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రమే స్వీకరిస్తే తప్ప అది ఎన్నటికీ పూర్తయ్యే అవకాశం ఉండకపోవచ్చు. అదీ సాధ్యం కాదు కనుక గొంగళి అక్కడే పడి ఉంటుంది.
ప్రాజెక్టు కోసం ఏమైనా నిధులు విడుదలైతే, అది ట్రాన్ స్టాయ్ కంపెనీకి సరిపోతుంది. కృష్ణా జల వివాదాలు కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టువిడుపులు ప్రదర్శించేందుకు సిద్ధమయితే తప్ప ఇరు రాష్ట్రాలకి ఆమోదయోగ్యంమైన పరిష్కారం దొరకదు. ఈ విషయంలో తెదేపా, తెరాస ప్రభుత్వాలు తమ రాష్ట్ర అవసరాల కంటే రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని బిగుసుకుపోయి ఉన్నందున ఈ సమస్యని ఉమా భారతి కాదు కదా ఆ బ్రహ్మదేవుడు కూడా తీర్చలేకపోవచ్చు. ఇలాగే మిగిలిన మూడేళ్ళ పుణ్యకాలం పూర్తయిపోతుంది కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది.