2024 టాలీవుడ్ కి పెళ్లిళ్ల సీజన్ అనే చెప్పాలి. చాలా మంది సినీ తారలు తమ జీవితంలోకి భాగస్వామిని ఆహ్వానించారు. కొత్త ఇన్నింగ్స్ కు శ్రీకారం చుట్టారు.
‘రాజావారు రాణిగారు’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన జంట నిజ జీవితంలో ఒక్కటయ్యారు. కిరణ్ అబ్బవరం- రహస్యలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొంత కాలం నుంచి ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు.. పెళ్లితో ఈ ఏడాది కొత్త జీవితం మొదలుపెట్టారు.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. సినీ నిర్మాత జాకీ భగ్నానీ ని పెళ్లి చేసుకుంది. రకుల్-భగ్నానీ చాలా కాలంగా ప్రేమలో వున్నారు. మొదటి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ప్లాన్ చేశారు. అయితే విదేశాల్లో వివాహ వేడుకలు చేసుకోవాలనుకునే భారతీయ యువ జంటలకు ప్రధాని మోదీ నుంచి ఈ ఏడాది ఓ ప్రశ్న ఎదురైయింది. తమ జీవితంలో నూతన ప్రయాణాన్ని విదేశాల్లో ఎందుకు ప్రారంభిస్తున్నారు? భారత్‌లో ఒక్కసారైనా డెస్టినేషన్ వెడ్డింగ్ చేశారా? అని దేశంలోని సంపన్న కుటుంబాల వారిని ప్రశ్నించారు. ‘మేకిన్ ఇండియా’ తరహాలో ‘వెడ్ ఇన్ ఇండియా’ ప్రారంభం కావాలన్నారు. ప్రధాని పిలుపు మేరకు రకుల్-భగ్నానీ గోవాలో ఒక్కటయ్యారు.
వరలక్ష్మీ శరత్‌కుమార్, నికోలయ్ సచ్దేవ్ తో ఏడు అడుగులు వేసింది. థాయిలాండ్‌లో పెద్దల సమక్షంలో సంప్రదాయ హిందూ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. ‘లై’, చల్ మోహన్ రంగా చిత్రాలతో అలరించిన నటి మేఘా ఆకాశ్ ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు సాయి విష్ణుని మనువాడింది.
చాలా కాలంగా బ్యాచిలర్ గా వున్న హీరో సిద్ధార్థ్ ఈ ఏడాది సోలో లైఫ్ కి స్వస్తి పలికాడు. హీరోయిన్ అదితిరావు హైదరీని పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. లవర్ బాయ్ ఇమేజ్ వున్న సిద్ధార్థ్ రిలేషన్షిప్స్ విషయంలో ఎన్నో రూమర్లు వున్నాయి. రంగ్ దే బసంతి సినిమా సమయంలో సోహ అలీ ఖాన్ కి దగ్గరయ్యాడని వార్తలు వినిపించాయి. శ్రుతి హాసన్, త్రిష తో కూడా కొన్నాళ్ళు స్నేహంగా ఉన్నాడని గుసగుసలు వినిపించాయి. ఇక సమంతతో కలిసి గ్రహ పూజలు చేయడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఎట్టకేలకు అదితిరావు హైదరీతో ఏడడుగులు వేసి ఓ ఇంటివాడయ్యాడు.
హీరోయిన్ కీర్తి సురేష్ మూడు ముళ్ళ బంధంలోకి అడుగుపెట్టింది. తాను ప్రేమించిన ఆంథోనీ తటిల్ తో ఏడడుగులు వేసింది. కీర్తి సురేశ్ – ఆంథోనీ దాదాపు 15 ఏళ్ల నుంచి స్నేహితులు. 15 ఏళ్ల తమ స్నేహబంధాన్ని జీవితాంతం కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఆంథోనీది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలలో వ్యాపారాలున్నాయి. స్కూల్ డేస్ నుంచి కీర్తితో ఆయనకు పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరి వివాహం హిందూ సంప్రదాయ ప్రకారం, అలాగే క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగింది.
‘తీన్మార్’, ‘ఒంగోలు గిత్త’ లాంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరైన కృతి కర్బందా, బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్ ని వివాహం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో విహరిస్తున్న ఈ జంట మూడు ముళ్లబంధంతో నూతన జీవితంలోకి అడుగు పెట్టింది.
విలన్ పాత్రలతో చేరువైన సుబ్బరాజు ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన పెళ్లి పట్ల చాలా ప్రైవసీ పాటించారు సుబ్బరాజు. ఒక ఫోటో తప్పితే మిగతా వివరాలేవీ బయటికి రివిల్ చేయలేదు.
యువ హీరో శ్రీ సింహా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సీనియర్ నటుడు మురళీ మోహన్ మనవరాలు రాగతో శ్రీసింహా వివాహం జరిగింది. యూఏఈలోని ప్రముఖ రిసార్ట్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఈ వేడుకల్లో రాజమౌళి దంపతులు డ్యాన్స్ చేయడం వైరల్ గా మారింది.
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మరోసారి వివాహ బంధంలో అడుగుపెట్టారు. ప్రీతి చల్లా అనే డాక్టర్ ని వివాహం చేసుకున్నారు. అంతకు ముందు క్రిష్ , డాక్టర్ రమ్య ల వివాహం జరిగింది. ఈ అయితే ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు. పరస్పర అంగీకారంతో విడాకులు జరిగాయి. ఈఏడాది మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు క్రిష్. ఈ వివాహం చాలా సింపుల్ గా రిజిస్టర్ పద్దతిలో చేసుకున్నారు. ప్రస్తుతం అనుష్క కథానాయికగా ఘాటీ సినిమా చేస్తున్నారు క్రిష్.
‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్, హీరోయిన్ చాందినీరావు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తిరుమల వేదికగా వీరి వివాహం జరిగింది. సందీప్ దర్శకత్వంలో వచ్చిన ‘కలర్ ఫొటో’లో చాందినీ రావు కీలక పాత్ర పోషించారు. దీని చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు.
ఈ ఏడాది నాగచైతన్య, శోభిత దూళిపాల వివాహం టాక్ అఫ్ టౌన్ గా నిలిచింది. సమంతతో విడాకుల తర్వాత కొన్నాళ్ళు ఒంటరిగా వున్న చైతు శోభితకు దగ్గరయ్యారు. అయితే అది స్నేహమా ప్రేమా అనే కోణంలో కథనాలు వచ్చాయి. అందరినీ సర్ ప్రైజ్ చేస్తూ పెళ్లి కబురుని తర్వాతగానే చెప్పారు. డిసెంబర్ 5 అక్కినేని ఇంట పెళ్లి బాజా మోగింది. నాగచైతన్య, శోభిత వివాహం అచ్చతెలుగు సంప్రదాయం జరిపారు. దాదాపు ఇండస్ట్రీ ప్రముఖులంతా తరలివచ్చిన ఈ కళ్యాణం కమనీయంగా జరిగింది.