ప్రధాని మోదీ ఉత్తరాంధ్ర పర్యటన ఖరారు అయింది. జనవరి 8న అనకాపల్లికి ప్రధాని మోదీ రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజున బహిరంగసభలో ప్రసంగించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ అధికారిక పర్యటనకు రావడం ఉత్తరాంధ్ర వస్తూండటంతో ఘనంగా ఏర్పాట్లు చేయనున్నారు. అనకాపల్లి నుంచి బీజేపీ తరపున ఎంపీగా సీఎం రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గత నెలలో ప్రధాని మోదీ విశాఖలో పర్యటించాల్సి ఉంది. రైల్వే జోన్ కు శంకుస్థాపనతో పాటు చాలా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే తుపాను హెచ్చరికల కారణంగా వాయిదా వేసుకున్నారు. ఈ సారి అనకాపల్లిలో పర్యటించబోతున్నారు. అక్కడి నుంచే రైల్వే జోన్ సహా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అధికారిక కార్యక్రమం కావడంతో ప్రదాని మోదీతో పాటు సీఎం, డిప్యూటీ సీఎంలు కూడా పాల్గొంటారు.
ఉత్తరాంధ్ర అభివృద్దిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం రాజధాని పేరుతో భూదందాలు చేశారు. ఈ సారి అలాంటి పరిస్థితి లేకుండా సాప్ట్ వేర్ హబ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి.