సినిమా ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించేవి పాటలే. సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళందుకు పాటలని ప్రధాన అస్త్రాలుగా మారుస్తుంటారు మేకర్స్. ఈ ఏడాది కూడా జనాల్లోకి దూసుకెళ్ళిన పాటలు, సినిమాపై అంచనాలని పెంచిన పాటలు, రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకుల మనసులో నిలిచినపోయిన పాటలూ వున్నాయి. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే..
మహేష్ బాబు ‘గుంటూరు కారం’లో దమ్ మసాలా, కుర్చీ మడత పెట్టి పాటలు మాస్ ని ఊపేశాయి. తమన్ ఈ రెండూ పాటల్ని మహేష్ ఫ్యాన్స్ కి నచ్చేలా ఇవ్వగలిగాడు. హనుమాన్ లో పూలమ్మెపిల్లా పాట జనాల్లోకి వెళ్ళింది. నా సామిరంగా లో ఎత్తుకెళ్ళాలి పాట సినిమా ప్రచారానికి బాగా కలిసొచ్చింది. కీరవాణి బాణీ, చంద్రబోస్ సాహిత్యం, రామ్ మిర్యాల పాడిన తీరు ప్రత్యేకంగా పాటని ప్రత్యేకంగా నిలిపాయి.
సుహాస్ అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు సినిమాలోని గుమ్మా సాంగ్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది. రిజల్ట్ మాట పక్కన పెడితే రవితేజ ఈగల్ సినిమాలో ఆడు మచ్చా సాంగ్ సినిమాపై అంచనాలు పెంచగలిగింది. రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటి వాయిస్ పాటకు ప్లస్ అయ్యింది.
సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన మ్యూజిక్ కి మంచి మార్కులు పడ్డాయి. శేఖర్ చంద్ర స్కోర్ చేసిన నిజమేనే చెబుతున్నా, హమ్మ హమ్మా పాటలు వైరల్ హిట్స్ గా నిలిచాయి. శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ సినిమాలో సర్ ప్రైజింగ్ సాంగ్ కుదిరింది. అర్జిత్ సింగ్ పాడిన ‘అణువణువు’పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మెలోడీ.
డీజే టిల్లులో అన్ని పాటలు జనాల్లోకి వెళ్ళాయి. టిక్కేటే కొనకుండా, రాధిక, ఓ మై లిల్లి, టిల్లు రీవ్యాంప్ పాటలు యూత్, మాస్ అందరినీ అలరించాయి. ఫ్యామిలీ స్టార్ లో నందనందన, కళ్యాణి వచ్చా వచ్చా పాటలు రీల్స్ లో తెగ తిరిగాయి. గ్యాంగ్స్ అఫ్ గోదావరిలో సుట్టంలా సూసి పాట వైరల్ అయ్యింది. యువన్ శంకర్ రాజా చాలా గ్యాప్ తర్వాత ఓ క్యాచి ట్యూన్ ఇవ్వగలిగాడు. సుదీర్ బాబు హరోం హర టైటిల్ సాంగ్ చెప్పుకోదగ్గదే.
ప్రభాస్ కల్కి లో భైరవ, థీమ్ అఫ్ కల్కి సాంగ్స్ పాన్ ఇండియాని ఆకర్షించింది. ఇవి పాటల్లా కాకుండా థీమ్స్ లా కంపోజ్ చేశారు.
కమిటీ కుర్రాళ్ళు సినిమాలో ఆ రోజులు మళ్ళీరావు సాంగ్ స్వీట్ మెలోడీగా నిలిచింది. డబుల్ ఇస్మార్ట్ లో స్టెప్పా మార్, మార్ ముంతా పాటలు మాస్ ని ఆకట్టుకున్నాయి. మిస్టర్ బచ్చన్ ఆడియో సూపర్ హిట్ అయ్యింది. సితార్, రెప్పల్ డప్పుల్, నల్లంచు పాటలు జలాల్లోకి దూసుకెళ్లాయి. సరిపోదా శనివారంలో భగభగ సౌండ్ ట్రాక్ పాపులర్ అయ్యింది.
2024 చార్ట్ బస్టర్ ఆల్బమ్ అంటే దేవర. సినిమాలో పాటలన్నీ ఒకటికి మించి ఒకటి హిట్ అయ్యాయి. ఫియర్ సాంగ్ ఆల్బమ్ అంచనాలు పెంచింది. చుట్టమల్లె సాంగ్ ఆ అంచనాలని అందుకుంది. దావుది, ఆయుధ పూజ పాటలు ఆడియన్స్ ని విపరీతంగా అలరించాయి. ముఖ్యంగా ఆయుధ పూజ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్స్ కి థియేటర్స్ లో విజల్స్ పడ్డాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఖుషి చేసిన ఆల్బమ్ ని కంపోజ్ చేశాడు అనిరుద్.
శ్రీవిష్ణు శ్వాగ్ సినిమాలో నీలో నాలో అనే ఓ మంచి రెట్రో మెలోడీ వుంది. జనాల్లోకి వెళ్ళలేదు కానీ వివేక్ సాగర్ మంచి ఫీల్ తో కంపోజ్ చేశాడు. లక్కీ భాస్కర్ లో శ్రీమతి గారు ఇన్స్టంట్ గా కాకుండా మెల్లగా జనాల్లోకి వెళ్ళింది.
దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2తో మరోసారి మ్యాజిక్ చేశాడు. దాదాపు అన్నీ పాటలు జనాల్లోకి వెళ్ళాయి. అయితే ప్రతి పాటని పుష్ప 1 తో పోలిక పెట్టడం కాస్త ఇబ్బంది పెట్టింది. పుష్ప టైటిల్ సాంగ్, సూసేకి, పీలింగ్స్ కిసిక్ పాటలు మాస్ ని అలరించాయి. థియేటర్ లో జాతర పాట సర్ ప్రైజ్ చేసింది.
ఇక 2025 ఆరంభంలో రాబోతున్న సినిమాలు అప్పుడే మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో జరగండి, రా మచ్చా, నానా హర్యానా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజైన దూప్ సాంగ్ లో చరణ్ డ్యాన్సులు ప్రత్యేకంగా నిలిచాయి. సంక్రాంతికి వస్తున్నాం గోదారి గట్టు పాట వైరల్ అయ్యింది. చాలా ఏళ్ల తర్వాత రమణ గోగుల తో ఈ పాట పాడించడం ఓ ఆకర్షణ. నాగ చైతన్య తండేల్ సినిమాలో బుజ్జితల్లి పాట కూడా జనాల్లోకి వెళ్ళిపోయింది.