ఓ పథకాన్ని హడావుడిగా ప్రారంభిండం కన్నా ప్రారంభించినప్పటి నుంచి సంతృప్తికర సేవలు అందించడమే ప్రయారిటీగా ఏపీ ప్రభుత్వం పని చేస్తోంది. ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడానికి పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. అదనపు బస్సులు, అదనపు సిబ్బందిని నియమించుకోవాలని నిర్ణయించింది. ఇప్పుడు ఉన్న బస్సులతో ఉచిత పథకం అమలు చేస్తే ప్రజలకు పథకం సరిగ్గా అమలు కాలేదన్న అసంతృప్తి వస్తుంది. అందుకే కొత్త బస్సు లు కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మొత్తం పదకొండువందల కొత్త బస్సులతో పాటు పదకొండువేల మందికిపైగా కొత్త సిబ్బందిని నియమించుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎలాంటి కసరత్తు లేకుండా ప్రారంభించారు. దీని వల్ల అనేక సమస్యలు వచ్చాయి. కర్ణాటకతో పాటు ఢిల్లీలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. అక్కడి పరిస్థితుల్ని అధ్యనం చేసి నివేదికలు రెడీ చేస్తున్నారు. మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా నియమించారు.
సంక్రాంతికి ఫ్రీబస్సు పథకాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఎలా అమలు చేయాలి.. నిజమైన పేదలే ఎక్కువగా వినియోగించుకునేలా ఎలా చేయాలన్నదానిపై కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ బస్సు పథకం వల్ల మహిళలకు ఆదాయం మిగులు స్పష్టంగా కనిపించేలా చూడాలని అనుకుంటున్నారు. కాస్త ఆలస్యమైన మహిళా మణులను సంతృప్తి పరిచేలా పథకం అమలు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.