కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థను రేవంత్ ప్రభుత్వం మళ్లీ తీసుకు వచ్చింది. సిసిఎల్ఎ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామాల్లో క్వాలిఫైడ్ విఆర్ఒ, విఆర్ఎలు నుంచి డేటా సేకరణ ప్రారంభిస్తున్నట్లు సదరు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ నెల 28వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ధరణిని తీసేసి భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది.
భూభారతి చట్టంలో భాగంగా రాష్ట్రంలో గ్రామానికో రెవెన్యూ అధికారి ఉండాల్సి ఉంది. గతంలో కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేసివారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న పూర్వ విఆర్ఒ, విఆర్ఎల్లో ఆసక్తి ఉన్న వారిని మళ్లీ అదే పొజిషన్లలో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఆప్షన్లను కోరుతూ సిసిఎల్ఎ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో మొత్తం 10,911 వరకు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి రెవిన్యూ గ్రామానికి వీఆర్వో ఉంటారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో ప్రతి గ్రామంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అయితే ఈ వీఆర్వోల అవినీతిపై ప్రజల్లో గతంలో చాలా ప్రజావ్యతిరేకత ఉండేది. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై పడింది.