హైదరాబాద్ ను మహా మహా నగరంగా విస్తరించబోతున్న రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుతో. ఎన్నో కొత్తకొత్త రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్లు పుట్టుకొస్తున్నాయి. పన్నెండు ప్రాంతాల్లో భారీ జంక్షన్లను ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా యాచారం దగ్గర ఒక ఇంటర్ చేంజర్‌ను నిర్మిస్తున్నారు. నాగార్జున సాగర్ హైవేను కనెక్ట్ చేస్తూ డిజైన్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సాగర్ రోడ్డు మీదుగా వెళితే.. ఇబ్రహీంపట్నం వరకూ ఇప్పుడు కలిసిపోయింది.
రీజినల్ రింగ్ రోడ్డు, దాని పక్కనే ఫ్యూచర్ సిటీ, యాచారం వద్ద వచ్చే భారీ జంక్షన్‌తో ఈ ప్రాంతం మరింత డెవలప్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ జంక్షన్ ఏర్పాటయ్యే యాచారం సమీపంలోని అఘపల్లి, గడ్డ మల్లయ్య గూడ, చౌదర్ పల్లి నుంచి మాల్ వరకు ఇప్పటికే భారీ స్థాయిలో రియల్ వెంచర్లు వెలిశాయి. రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్ ఏర్పాటవుతుండటంతో లావాదేవీలు పెరిగే అవకాశం ఉంది.
ఇబ్రహీంపట్నం లో డీటీసీపీ లేఅవుట్ లో రియాల్టీ ప్రాజెక్టు, ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 15 వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల వరకు ధరలున్నాయి.యాచారం సమీప పరిసర ప్రాంతాల్లో చదరపు గజం 8 వేల నుంచి దొరుకుతున్నాయి. ఇబ్రహీం పట్నం పరిసరప్రాంతాల్లో కొన్ని నిర్మాణ సంస్థలు విల్లాల్ని నిర్మిస్తున్నాయి.యాచారం కు రెండు వైపులా ఇటు ఇబ్రహీం పట్నం, అటు మాల్ వరకు భారీ ఎత్తున విద్యా సంస్థలు ఉన్నాయి. ఇక ఇప్పుడు రెండు లెన్లుగా ఉన్న సాగర్ హైవే రోడ్డు నాలుగు లేన్లుగా మారుస్తున్నారు. ఈ పరిణామాలతో వచ్చే పదేళ్లలో యాచారం మరో ఎల్బీ నగర్ జంక్షన్ గా మారుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.