ఫైబర్ నెట్ నుంచి నాలుగు వందల మంది ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లుగా జీవీరెడ్డి ప్రకటించారు. త్వరలో మరో రెండు వందల మందిని తీసేస్తామన్నారు. ఎందుకు అంటే..వీళ్లెవరూ ఫైబర్ నెట్ కోసం పని చేయలేదని.. చేయడం లేదని వైసీపీ నేతల ఇళ్లల్లో డ్రైవర్లుగా,ఇంటి పని వారుగా సోషల్ మీడియా కార్యకర్తలుగా పని చేస్తున్నారని చెప్పారు. ఆ విషయం కనిపెట్టడానికి జీవీ రెడ్డికి ఆరు నెలలు పట్టిందేమో కానీ ప్రభుత్వంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడో తెలుసు.
ఫైబర్‌నెట్‌లో కేవలం ముగ్గురే పర్మినెంట్ ఉద్యోగులు. అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులే. ఫైబర్ నెట్ ను వైసీపీ ప్రభుత్వం ఎవరూ పిండుకోని విధంగా పిండుకుంది. ఒక్క రూపాయి ఆదనంగా పెట్టుబడి పెట్టి సేవలు మెరుగుపర్చకపోగా చార్జీలు పెంచి.. అప్పులు చేసి ఇష్టారీతిన డబ్బులు ఖర్చు పెట్టేసింది. రైల్వే అకౌంట్స్ లో ఉండే మధుసూదన్ రెడ్డి అనే అధికారిని డిప్యూటేషన్ పై తెచ్చి అన్ని పనులు పూర్తి చేసుకున్నారు. కనీసం వెయ్యి కోట్లకుపైగా పక్కదోవపట్టాయి. ఎన్నికల ఫలితాలు రాగానే రికార్డులు, ఫైల్స్ ధ్వంసం చేసి మధుసూదన్ రెడ్డి దొరికిపోయారు. దాంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ ఆరు నెలలుగా అక్రమంగా నియమించిన వారందరికీ జీతాలిస్తున్నారేమో కానీ హఠాత్తుగా వారిని తొలగిస్తున్నామని చెప్పుకొచ్చారు. మాములుగా అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. వైసీపీ హయాంలో నియమితులైన ఒక్క కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వకూడదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే కేసులు పెట్టాల్సింది. కానీ ఆరు నెలల వరకూ జీతాలిచ్చి ఇప్పుడు పంపేస్తున్నారంటేనే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇది మంచి ప్రభుత్వం అని వారు కూడా అనుకుని ఉంటారని సెటైర్లు పడుతున్నాయి.