సుమారు 12 ఏళ్ల క్రితం పొరపాటున పాకిస్తాన్ చేరుకొని అక్కడే పెరిగి పెద్దదైన గీత అనే మూగ చెవిటి యువతిని, ఇరుదేశాల అధికారులు చొరవతో తిరిగి భారత్ రప్పించడం అందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్ సినిమాయే దానికి ప్రేరణ. కానీ ఆ సినిమాలోలాగ ఆమె కధ సుఖాంతం కాకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. ఆమె తన తల్లితండ్రులని గుర్తు పట్టలేకపోవడంతో అప్పటి నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ పట్టణంలో గల మహిళా సంరక్షణాలయంలో ఉంటోంది. ప్రభుత్వమే ఆమె బాగోగులు చూసుకొంటోంది. ఇంచుమించు అటువంటి కధే 12 ఏళ్ల సోనూది కూడా. కాకపోతే సోను తన తల్లితండ్రులని గుర్తుపట్టడం వారు కూడా అతనిని గుర్తుపట్టడంతో సోను కధ సుఖాంతం అయ్యింది.
సోనుకి తల్లితండ్రులు డిల్లీ శివార్లలో గల సీమాపురి అనే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఒకరోజు సోను తమ ఇంటి బయట ఆడుకొంటుండగా కిడ్నాప్ చేయబడ్డాడు. సోనుని విడిచిపెట్టేందుకు లక్ష రూపాయలు కావాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. దిగువ మధ్యతరగతికి చెందిన సోను తల్లితండ్రులు మాధురి ముంతాజ్, మహబూబ్ అతికష్టం మీద రూ.90వేలు పోగు చేసి కిడ్నాపర్లకి చేతికిచ్చారు. కానీ వారు సోనుని విడిచిపెట్టలేదు. ఆ డబ్బుతోనే సోనుని బంగ్లాదేశ్ కి తరలించారు. ఈ సంఘటన 2010లో జరిగింది. అప్పటి నుంచి కిడ్నాప్ చేసిన రహిమా అనే వ్యక్తివద్ద సోను నరకం అనుభవించేవాడు. అప్పటికి సోను ఆరేళ్ళ బాలుడు. ఊరుగాని ఆ ఊరులో తన బాధలు ఎవరికీ చెప్పుకోలేక నరకం అనుభవించేవాడు. సోను ఇంటికి పొరుగునే నివసిస్తున్న జమాల్ బిన్ మూస అనే వ్యక్తి సోను పరిస్థితి చూసి అతనిని ఎలాగయినా తిరిగి అతని తల్లి తండ్రుల వద్దకి చేర్చాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నాలు ఫలించకపోగా నెల రోజులు జైలులో గడపవలసి వచ్చింది. అయినప్పటికీ అతను పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో అతనే ఒకసారి డిల్లీకి వచ్చి సోను ఇచ్చిన ఆధారాలతో అతని తల్లితండ్రులని వెతికి పట్టుకొని సోను బాధల గురించి చెప్పాడు. వారు అధికారులని కలవడంతో అక్కడి నుంచి కధ వేగం పుంజుకొంది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో ఎట్టకేలకు సోను డాకా నుంచి మొన్న డిల్లీ చేరుకొన్నాడు. తనకోసం ఎదురుచూస్తున్న తల్లితండ్రులని గుర్తుపట్టాడు. వారు కూడా అతనిని వెంటనే గుర్తుపట్టారు. సుష్మాస్వరాజ్ సమక్షంలో అధికారులు సోనుని అతని తల్లితండ్రులకి అప్పగించడంతో అతని కధ సుఖాంతం అయ్యింది. ఆరేళ్ళ క్రితం తప్పిపోయిన తమ కుమారుడు సరిగ్గా రంజాన్ పండుగ సమయానికి తిరిగిరావడంతో వారి ఆనందానికి అంతే లేదు. అందుకు కారకుడైన జమాల్ బిన్ మూసని కలిసి కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు సోను తల్లితండ్రులు త్వరలో బంగ్లాదేశ్ వెళుతున్నారు. మానవత్వానికి కులాలు, మతాలు, జాతులు, దేశాలు, బాషలు అడ్డుగోడ కావని జమాల్ బిన్ మూస నిరూపించి చూపారు. అందుకు ఆయనకి, బజరంగీ భాయ్ జాన్ కి, అటువంటి గొప్ప కధని వ్రాసిన విజయేంద్ర ప్రసాద్ కి మరొక్కమారు కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే.