ఓ సినిమాలో కానిస్టేబుల్ ఎమ్మెస్ నారాయణ రేయ్ అని అరుస్తాడు.. వెళ్లిపోతున్న సునీల్ అగి.. నువ్ అరిచావని ఆగలేదు.. అలా అరిస్తే ఎవరూ ఆగరు అని చెప్పడానికి ఆగానని చెప్పి వెళ్లిపోతాడు. అంటే ఎమ్మెస్ గొంతు అంత కీచుగా ఉందన్నమాట. ఇవాళ గుంటూరు జిల్లా జైలు ముందు టీడీపీకి హెచ్చరికలు జారీ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గొంతు కూడా అలాగే ఉంది. తాము రాగానే ఏదో చేస్తామని ఆయన అంటున్నారు. వారు ఉన్నప్పుడు మ్యాగ్జిమం చేశారు. ఇంత కంటే ఇంకేమీ చేయలేరు అని టీడీపీ క్యాడర్ తిరగబడేంత చేశారు. ఇప్పుడు వారు అదే బెదిరింపులు చేస్తున్నారు.
నక్సలైట్లను అరెస్టు చేసినట్లుగా తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని అంటున్నారు.ఊరకనే ఎందుకు అరెస్టు చేస్తున్నారు.. వారు చేసిందేమిటో తెలియదా?. చేయించినదంతా వీరు చేయించినదేగా. చివరికి తమపై న్యాయవ్యవస్థలు కూడా జాలిచూపకుండా ఆ వ్యవస్థలను కూడా టార్గెట్ చేసి రెచ్చిపోయారు. ఇప్పుడు అనుభవించాల్సిన వంతు వచ్చింది. తాము వచ్చాక ఏదో చేస్తామని చెబుతున్నారు కానీ ముందుగా రావడానికి ఏం చేయాలో మాత్రం ఆలోచించడం లేదు.
ఇప్పటి వరకూ సోషల్ మీడియా కార్యకర్తల్నే అరెస్టులు చేస్తున్నారు కానీ.. .వచ్చే ఏడాది అసలు విలన్ల భరతం పట్టడం ఉంటుందని టీడీపీ వర్గాలు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. ఇసుక, మద్యం, అదానీ లంచాలు సహా అన్నీ బయటకు వస్తాయని.. ఒక్కొక్కరు లోపలికి వెళ్తారని అంటున్నారు. ఇప్పుడే ఇంత కీచు గొంతుతో అరిస్తే.. అప్పుడు అరవడానికి ఇక ఓపిక ఉండదేమో ?