సాయి పల్లవి ఓ కథ ఒప్పుకొందంటే – అందులో మేటర్ ఉన్నట్టే లెక్క. తను తన సినిమాల్ని ఆచి తూచి ఎంచుకొంటుంది. సినిమాల్లేక పోయినా ఫర్వాలేదు. ఖాళీగా అయినా కూర్చుంటుంది తప్ప, ఏది పడితే అది చేయదు. అందుకే సాయిపల్లవి ఓ సినిమా చేస్తోందంటే ఆటోమెటిగ్గా అందరి కళ్లూ అటువైపు తిరుగుతాయి. తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పింది సాయిపల్లవి.
‘బలగం’తో ఆకట్టుకొన్నాడు వేణు. దర్శకుడిగా తొలి సినిమాతోనే తన మార్క్ చూపించాడు. ఆ సినిమాకు అవార్డులు, రివార్డులూ అందాయి. తదుపరి సినిమాగా ‘ఎల్లమ్మ’ని పట్టాలెక్కించబోతున్నాడు. దిల్ రాజు నిర్మాత. నితిన్‌ని హీరోగా ఎంచుకొన్నాడు. ఇందులో కథానాయిక పాత్ర చాలా కీలకం. ఆ పాత్రకు గానూ ఓ స్టార్ కావాలి. అందుకే ఈ కథ సాయి పల్లవి దగ్గరకు వెళ్లింది. కథ సాయి పల్లవికి బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేసింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది.
సాయిపల్లవి నటించిన ‘తండేల్’ ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఆ తరవాత.. ‘ఎల్లమ్మ’ సెట్స్‌పైకి వెళ్తుంది. నితిన్ నుంచి కూడా ‘రాబిన్‌వుడ్’ రావాలి. ‘తమ్ముడు’ విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె.కుమార్ కథకు ఓకే చెప్పాడు నితిన్. ‘ఎల్లమ్మ’తో పాటు ఆ సినిమా కూడా సమాంతరంగా పూర్తి చేస్తాడు.