తెలంగాణ త్రయం అంటే కెటిఆర్,కవిత హరీష్ రావు ఈ ముగ్గురి వ్యవహారసరళిలో ఈ మధ్య చాలా తేడా కనిపిస్తున్నది. జిహెచ్ఎంసి ఎన్నికలు ఆ తర్వాత కొన్ని మాసాలు కెటిఆర్ మహాజోరుగా సంచరించారు. ఎక్కడికక్కడ ప్రత్యక్షమై ఆదేశాలు ఇస్తూ అసలైన అధికారం తనదే అనిపించారు. తర్వాత కొన్ని ఐటి సంబంధిత కార్యక్రమాలు ప్రారంభించారు. విదేశీ యాత్రలు చేశారు. ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన అంత ప్రత్యక్ష పాత్రలో కనిపించడం లేదు. ఇది వ్యూహత్మకమే అనేవారున్నారు. ఎలాగూ తనదే వారసత్వమని తేలిపోయింది గనక ఇంకా హడావుడి ఎందుకని వూరుకుంటున్నారని వ్యాఖ్యానించేవారు కూడా ఆ పార్టీలోనే వున్నారు. ఇక కవిత కూడా అన్నకు ఏమాత్రం తగ్గకుండా అన్నింటా తానై అగుపించేవారు. ఏదైనా సంక్లిష్ట సమస్య వస్తే చాలు ముందుకొచ్చి విమర్శలతో విరుచుకుపడేవారు. అలాటి వ్యక్తి ఈ మధ్య కొంత పరిమితంగానే మాట్లాడుతున్నారు. హైకోర్టు సమస్యమీద తప్ప చెప్పుకోదగ్గ జోక్యం చేసుకోలేదు.
ఈ ఇద్దరితో పోలిస్తే మంత్రి హరీష్ రావు కదలికలు బాగా పెరిగాయి. చాలా విస్త్రతంగా పర్యటిస్తున్నారు. తనిఖీలు చేస్తూ ఆదేశాలు ఇస్తున్నారు. నీటి ప్రాజెక్టులు ఎలాగూ వివాదగ్రస్తమే గనక అటు అంతర్గతంగా రాష్ట్ర ప్రతిపక్షాలకూ ఇటు పొరుగురాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కౌంటర్లు ఇస్తూ సవాళ్లు చేస్తూ వాతావరణం వేడెక్కిస్తున్నారు. తమాషా ఏమంటే ఈ క్రమంలో రాజకీయ సంకేతాలు కూడా వదులుతున్నారు. కెటిఆర్ డైనమిక్లీడర్ అని అన్నట్టు ఒక వార్త వచ్చింది. ఇంతకంటె పెద్ద పదవి నా జీవితంలో రాదు అని అన్నట్టు మరో వార్త.ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి కుటుంబసభ్యులకు తన పాత్రపై క్లారిటీ ఇవ్వడానికా? లేక అభిమానులను చల్లబర్చడానికా? పుట్టిన రోజున పాదాభివందనం చేయడం కూడా తెలంగాణ సంప్రదాయం ప్రకారం జరిగేది కాదట. ఏమంటే మేనమామ కాళ్లు మొక్కడంలోనూ వుండే పద్ధతులను కూడా పక్కనపెట్టి బహిరంగంగా నమస్కరించి సంతృప్తి పర్చేందుకు ఆయన ప్రయత్నిస్తే కెసిఆర్ ఇబ్బంది పడ్డారని అంటారు. ఆ ఫోటోలో కెసిఆర్ బాడీ లాంగ్వేజి చూసినా చిరునవ్వు కంటే అసౌఖ్యమే కనిపిస్తుంది.
కెటిఆర్ కవితల కన్నా హరీష్ ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నారు? ఈ ప్రశ్నకు టిఆర్ఎస్ నేతలు అనేక జవాబులు చెబుతున్నారు. ఒక ప్రజా ప్రతినిధి చెప్పిన ప్రకారం వారింకా అధికార లాంచనాలు హడావుడి చవిచూడాలనే ధోరణిలో వున్నారు. కాని వైఎస్ హయాంలోనే మంత్రిగా పనిచేసి దీర్ఘకాలంగా ప్రజాజీవితంలో వున్న హరీష్ ప్రజలను కలుసుకోకుండా వుండలేకపోతున్నారు.మామ మనస్తత్వం గురించి కొంత సంకోచం వున్నా జనంలో పడి తిరగడమే మంచిదన్నఅంచనాకు వచ్చారు. మామూలుగానే ఆయన దగ్గరకి జనం ఎక్కువగా వస్తుంటారు. ఎవరు వచ్చినా అడిగిన దానిపై ఎంతో కొంత స్పందన చూపిస్తారు. పోన్ చేయడం, పరిచయం కల్పించడం ఆదేశాలివ్వడం ఏదో ఒకటి. కెటిఆర్ దగ్గరికి సంపన్నులు పైరవీ కారులు ఎక్కువగా వస్తే హరీష్ దగ్గరికి మామూలు జనం వస్తారని అంటారు.అయితే ఈ హడావుడిలో అందరి పనులు చేసి పెట్టడానికి తాపత్రయ పడటం కంటే నిజంగా ఉపయోగపడే వారిని ప్రత్యేకంగా కనిపెట్టి వుండటం అవసరమని హరీష్ శిబిరం భావిస్తున్నదట!