సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటన అంశం, అల్లు అర్జున్ పై కేసుల గురించి ఎవరూ మాట్లాడవద్దని రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా మీడియాలో వచ్చింది. ఆయన పీఆర్ టీం ఈ సమాచారాన్ని మీడియాకు ఇచ్చింది. మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అంత వరకూ బాగానే ఉంది. ఈ సమాచారం అసలు మాట్లాడే కాంగ్రెస్ నేతలకు చేరవేశారా లేదా అన్నడౌట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి నుంచి ఇలాంటి సూచనలు వచ్చిన తర్వాత కూడా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. ఆంధ్రా,తెలంగాణ అంటూ అనుచితంగా మాట్లాడారు.
ఒక్క నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కాదు .. ఎవరెవరో వస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు. పోడూరి శ్రీనివాస్ రెడ్డి అనే లాయర్ అయితే ఏకంగా చంద్రబాబును కూడా ముడి పెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్ర చేస్తున్నారని అంటారు. ఆయన రేవంత్ రెడ్డికి సపోర్టుగా మాట్లాడాడో.. వ్యతిరేకంగా మాట్లాడాడో అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. చాలా మంది ఈ విషయంలో ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. ఎవరూ మాట్లాడకుండా కట్టడి చేయడం పెద్ద విషయం కాదు. కానీ అన్నీ రేవంతే చూసుకోలేరు. ఆయన ఓ సూచన ఇచ్చినప్పుడు పట్టించుకోకపోవడం ఆయనను అవమానించినట్లే.
అల్లు అర్జున్ విషయం రాను రాను రాంగ్ ట్రాక్ లోకి వెళ్తోందని అందరికీ అర్థమైపోయింది. వీలైనంత వరకూ ఇక సైలెంట్ మోడ్ లోనే ఆ కేసు వ్యవహారం నడవాలని ఇందులో ఇన్వాల్వ్ అయిన వారు కోరుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అలా ఉండనీయడం లేదు.