పాపం జగనన్నా.. అనుకుని జాలి పడ్డారు కడప వైసీపీ కార్పొరేటర్లు. ఎందుకంటే జగన్ రెడ్డి వారితో సమావేశంలో అంత దీనంగా మాట్లాడారు మరి. కడప కార్పొరేషన్ చేజారిపోతుందేమోన్న ఆందోళన జగన్ లో కనిపిస్తోంది. ఒక్క కార్పొరేటర్ కూడా లేని టీడీపీలో ఇప్పుడు పదకొండు మంది చేరిపోయారు. మరికొంత మంది చేరితే పదవి పోతుంది. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇంకా సమయం ఉంది. ఆ లోపు వెళ్లిపోతే.. పరువు పోతుంది. అందుకే జగన్ స్వయంగా రంగంలోకి దిగి .. పార్టీని విడిచిపెట్టొద్దని బతిమాలుతున్నారు.
కడప కార్పొరేటర్లు అంతా వైఎస్ ఫ్యామిలీకి అనుచరులే. అవినాష్ రెడ్డితో పాటు రాజకీయాలు చేసేవారే. వారెందుకు పార్టీ మారతారు ?. వారికి బిల్లులు లేకపోతే ఇతర ప్రభుత్వ పనుల కారణంగా పార్టీ మారతారు. టీడీపీపై అభిమానంతో ఎవరూ వెళ్లరు. ఆ విషయం జగన్ రెడ్డికి తెలుసు. అయితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ పనులు చేయలేదు. బిల్లులు ఇవ్వలేదు. అందుకే బతిమాలుకోక తప్పడం లేదు. మీ సమస్యలన్నింటినీ ఏదో విధంగా తీర్చే ప్రయత్నం చేస్తాను కానీ పార్టీ మారొద్దని అంటున్నారు.
ఆయన కార్పొరేటర్లను బతిమాలుకున్న తీరు చూసి పాపం.. ఎలా ఉండే జగనన్న ఎలా అయిపోయారని కార్పొరేటర్లు కూడా మనసులో జాలి పడిఉంటారు. ఈ జాలితో అయినా పార్టీలో ఉంటారా లేకపోతే.. తమ పనులు, నిధులు అని చెప్పి.. రేపటికి మర్చిపోయి వెళ్లిపోతారా అన్నది వచ్చే రెండు, మూడు నెలల్లో తేలిపోతుంది. కార్పొరేషన్ లో తనకు జరిగిన అవమానంతో కడప రెడ్డెమ్మ మాధవీరెడ్డి మేయర్ కుర్చీని లాగేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.