ఒకప్పుడు వందకోట్లు అంటే కొండత టార్గెట్ లా కనిపించేది. కానీ ఇప్పుడా టార్గెట్ ని చేరుకోవడం సులభం అయిపోయింది. దీనికి కారణం.. తెలుగు సినిమాకి అన్ని చోట్ల మార్కెట్ లు ఓపెన్ అయ్యాయి. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో తెలుగు సినిమా అదరగొడుతోంది. స్టార్ట్ బలం వున్న సినిమాలు మంచి ఓపెనింగ్స్ రాబడుతున్నాయి. వారం రోజుల్లోనే టార్గెట్ ని చేరుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా బాక్సాఫీసు మురిసింది. వెయ్యికోట్లు కొట్టిన రెండు సినిమాలు, మూడు వందల కోట్ల మార్కు దాటిన సినిమాలు.. అలాగే సెంచరీ కొట్టిన సినిమాలు వున్నాయి. ఒక్కసారి వివరాల్లోకి వెళితే…
ఈ ఏడాది ‘గుంటూరు కారం’తో పండగ బరిలో దిగారు మహేష్ బాబు. మహేష్, త్రివిక్రమ్ కలిసి చేసిన అతడు, ఖలేజా సినిమాలకి కల్ట్ ఫాలోయింగ్ వుంది. దీంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే అంచనాలు పెరిగాయి. ఒకొక్క ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా హైప్ ని పెంచాయి. అయితే ఈ సినిమాకి ఆశించిన పాజిటివ్ టాక్ రాలేదు. కానీ మహేష్ స్టామినా కారణంగా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. రిపోర్ట్ నెగిటివ్ గా ఉన్నప్పటికీ టోటల్ రన్ లో దాదాపు రూ.170కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు లెక్క గట్టాయి.
‘హనుమాన్’ సినిమా అనూహ్య విజయం సాధించింది. సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా దిగిన హనుమాన్ ఎవరూ ఊహించిన అఖండ విజయం సాధించింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ కి ఈ సినిమా బాగా పట్టింది. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి క్రమంగా థియేటర్స్ సంఖ్య పెరిగింది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది.
సలార్ విజయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కల్కితో అదరగొట్టారు ప్రభాస్. పాన్ వరల్డ్ ని దృష్టి పెట్టుకొని ఈ సినిమాని తయారు చేశాడు నాగ్ అశ్విన్. ప్రమోషన్స్ హాలీవుడ్ రేంజ్ లో చేశారు. ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్ తో అబ్బురపరిచిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసులు వర్షం కురిపించింది. అమితాబ్, దీపిక పదుకొనే లాంటి బాలీవుడ్ స్టార్స్ యాడ్ అవ్వడం మరింత ప్లస్ అయ్యింది. టోటల్ గా సినిమా వెయ్యికోట్ల మార్క్ ని దాటేసింది.
తెలుగులో సీక్వెల్స్ వర్క్ అవుట్ కావనే సెంటిమెంట్ ని డీజే టిల్లు2 తుడిచేసింది. ఆడియన్స్ టిల్లు క్యారెక్టర్ కి మరోసారి ఫిదా అయ్యారు. సినిమా డేజావు లాంటి రిపీట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందనే రివ్యూలు వచ్చినప్పటికీ టిల్లు ఫన్ అందరికీ నచ్చింది. టోటల్ రన్ లో ఈ సినిమా 120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
విడుదలకు ముందే అనేక రికార్డులు బ్రేక్ చేసిన ఎన్టీఆర్ ‘దేవర’ ఈ ఏడాది మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలబడింది. భారీ అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమాకి బిగినింగ్ లో కొన్ని మిశ్రమ రివ్యూలు వచ్చాయి. అయితే ఈ రివ్యూలు సినిమా వసూళ్ళపై ప్రభావం చూపలేదు. సినిమా చాలా నిలకడగా బాక్సాఫీసు ముందు నిలబడి 500 కోట్ల మార్క్ దాటింది.
నాని, దుల్కర్ సల్మాన్ లాంటి యంగ్ హీరోలు ఈ ఏడాది సెంచరీలు కొట్టే సినిమా సినిమాలు అందించారు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ఆడియన్స్ ని అలరించింది. ఈ సినిమాకి తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ రన్ లో రూ.100 కోట్లు సాధించింది. గత ఏడాది దసరా, హాయ్ నాన్నలతో అలరించి ఈ ఏడాది ‘సరిపోదా శనివారం’తో హ్యాట్రిక్ కొట్టాడు నాని. నిజానికి ఈ సినిమా రిలీజ్ టైమ్ లో వర్షాలు వరదలు ఇబ్బంది పెట్టాయి. అయినప్పటికీ సినిమా వందకోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం.
2024కి అల్టిమేట్ టచ్ పుష్ప 2 ఇచ్చింది. డిసెంబర్ 5న వచ్చిన పుష్ప ఇండియన్ బాక్సాఫీసు ని రూల్ చేసింది. తెలుగులో పాటు హిందీలో అదరగొట్టింది. ఇప్పటికే 1,500 కోట్ల గ్రాస్ దాటిసినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కకట్టాయి. సినిమా ఇంకా రన్ లో వుంది. ఫైనల్ మార్క్ ఎంత అనేది ఆసక్తికరం. మొత్తనికి 2024 టాలీవుడ్ బాక్సాఫీసు భారీ విజయాలతో మురిసిందనే చెప్పుకోవాలి.