‘చంటబ్బాయి’ లాంటి డిటెక్టీవ్ కథలెప్పుడూ చూడ్డానికి బాగుంటాయ్. కామెడీ వర్కవుట్ అయి, ఇన్వెస్టిగేషన్ లో కిక్ ఉంటే సినిమా సక్సెస్ అయిపోయినట్టే. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ కాసుల వర్షం కురిపించింది. నవీన్ పొలిశెట్టిని స్టార్‌గా మార్చేసింది. ఈ కథలకు ఆ దమ్ము ఉంది. వెన్నెల కిషోర్ చంటబ్బాయ్ టైపు కథ ఎంచుకోవడం, దానికి ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ అంటూ తమాషా పేరు పెట్టడం, ‘పుష్ప 2’ తరవాత అత్యధిక గ్రాస్ తెచ్చుకొనే సినిమా ఇదే అవుతుంది అని ఈ సినిమా కొన్న డిస్టిబ్యూటర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఛాలెంజ్ చేయడం.. ఇవన్నీ కలిసి ‘శ్రీకాకుళం..’ పై ఆసక్తిని, అంచనాల్ని పెంచేశాయి. మరింతకీ ఈ సినిమా ఎలా వుంది? చంటబ్బాయ్లా నవ్వించిందా, ఆ ఇన్వెస్టిగేషన్ థ్రిల్ పంచిందా?
రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజు… విశాఖపట్నం సముద్రం ఒడ్డున మేరీ అనే ఓ అమ్మాయి హత్యకు గురవుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎస్.ఐ (అనీష్ కురువిల్లా) రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన కేసులో బిజీ అయిపోతాడు. అందుకే ప్రైవేట్ డిటెక్టీవ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ (వెన్నెల కిషోర్)కు అప్పగిస్తారు. ఈ కేసులో ఏడుగురు అనుమానితుల్ని పట్టుకొంటాడు షెర్లాక్ హోమ్స్. వాళ్లందరినీ ఓ పెద్ద ఇంట్లో తీసుకచ్చి పెడతాడు. ఒకొక్కర్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ, చేస్తూ వెళ్తుంటే ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలు తెలుస్తుంటాయి. మరింతకీ మేరీని హత్య చేసిందెవరు? ఆ అవసరం ఎవరికి వచ్చింది? మేరీ హత్య వెనుక దాగున్న నిజాలేంటి? అనే విషయాలన్నీ తెరపై చూసి తెలుసుకోవాలి.
ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌కి కావాల్సిన ముడి సరుకు ఈ కథలో ఉంది. అందులో అనుమానం లేదు. కాకపోతే… చంటబ్బాయ్లా నవ్విస్తూ, సస్పెన్స్‌కు గురి చేస్తూ, చివర్లో థియేటర్లు దద్దరిల్లిపోయేలా ఓ ట్విస్ట్ ఉంటే తప్ప ఇలాంటి కథలు వర్కవుట్ అవ్వవు. వెన్నెల కిషోర్ మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. తన ముందు యావరేజ్ సీన్ పెట్టినా, తన టైమింగ్ తో దాన్ని సూపర్ హిట్ చేసి నవ్వించేయగలడు. కానీ దురదృష్టం ఏమిటంటే.. కనీసం అలాంటి యావరేజ్ సీన్లయినా దర్శకుడు రాసుకోలేకపోయాడు. దాంతో ఏ కొశాన కామెడీ వర్కవుట్ అవ్వలేదు. వెన్నెల కిషోర్ గనుక డిటెక్టీవ్ కనుక, ఈ సినిమాలో హీరో తనే అని ఫోకస్ చేశారు గనుక.. కచ్చితంగా కాసేపు సరదాగా నవ్వుకొందామనే ధియేటర్లకు వెళ్తారు ఆడియన్స్. కానీ అలాంటి నవ్వులు ఈ సినిమాలో కనిపించవు. వినిపించవు. వెన్నెల కిషోర్ శ్రీకాకుళం యాసలో కామెడీ చేద్దామని తెగ ప్రయత్నించినా, అది వర్కవుట్ కాలేదు. ఆమాటకొస్తే.. శ్రీకాకుళం యాసలో వెన్నెల కిషోర్ మాట్లాడుతుంటే ఇరిటేషన్ వస్తుంటుంది. ఆ యాస, అందులోని సొగసుని వెన్నెల కిషోర్ పట్టుకోలేకపోయాడు.
సరే.. కామెడీ వర్కవుట్ కాలేదు. కనీసం మర్డర్ మిస్టరీ, అందు కోసం హీరో చేసే ఇన్వెస్టిగేషన్ అయినా రసవత్తరంగా ఉండాలి కదా. అదీ లేదు. ఇన్వెస్టిగేషన్ లో క్లూలు వెదకడం, దాన్ని బట్టి అనుమానితుల్ని పట్టుకోవడం ఓ ఇంట్రస్టింగ్ ఎలిమెంట్. అది ఈ కథలో పూర్తిగా మిస్ అయ్యింది. హీరోని వెదుక్కొంటూ క్లూలు వచ్చేస్తుంటాయి. అదేంటో.. డిటెక్టీవ్ కి ప్రతీ క్లూ.. ఆ సముద్రపు ఒడ్డునే ఒకదాని తరవాత మరోటి దొరికేస్తాయి. ఆ క్లూల ఆధారంగా అందర్నీ పట్టేస్తాడు హీరో. చివర్లో.. ఓ పెద్ద స్పీచ్ ఇస్తూ, ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, హంతకుడు ఎవరు అనేది పేజీల కొద్దీ డైలాగులు చెబుతూ.. వివరించేస్తాడు. ఇన్వెస్టిగేషన్ డైలాగుల రూపంలో చెప్పడంలో కిక్ ఏముంటుంది? అలాగైతే.. పుస్తకాలే కొని చదువుకోవొచ్చు కదా? సినిమా ధియేటర్ వరకూ రావడం ఎందుకు? సినిమా అనేది విజువల్ మీడియా. ఏదైనా సరే.. కళ్లకు కట్టినట్టు చూపించాలి. మరీ ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ని. కానీ అది ఈ సినిమాలో మిస్ అయ్యింది.
హత్య ఎలా జరిగింది? అనే విషయాన్ని ఒకొక్క పాత్రతో చెప్పించుకొంటూ వెళ్లాడు. ఒకరి వెర్షన్ లో కథ ఒకలా ఉంటే, మరొకరి వెర్షన్లో మరోలా ఉంటుంది. అక్కడి వరకూ ఓకే. కానీ తెరపై చూసిన సీనే… చూసిన ఎమోషనే… మళ్లీ రిపీట్ మోడ్ లో వస్తుంటాయి. దాంతో ప్రేక్షకుల్లో విసుగు మొదలవుతుంది. వెన్నెల కిషోర్ పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. ఎమోషన్ డ్రైవ్ కోసం. అది ఓ మోస్తరుగా ఉంటుందంతే. దాని వల్ల కథలో పెద్ద కదలిక ఉండదు. పైగా కథనానికి బ్రేక్ ఇచ్చినట్టు అవుతుంది. చివర్లో ఐటెమ్ సాంగ్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. మధ్యలో లెస్బియన్ ఎపిసోడ్ ఒకటి తగిలించారు. దాని వల్ల `ఏ` సర్టిఫికెట్ వచ్చింది తప్ప, పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
వెన్నెల కిషోర్ కామెడీ చేయలేక, బేలగా చూస్తుండిపోవడం తొలిసారి కనిపించింది. ఇన్నేళ్ల కెరీర్లో. తను పాత్రలోకి పూర్తిగా వెళ్లకపోవడమే పెద్దలోపమేమో అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. అనన్య నాగళ్ల మంచి పాత్రల్ని చేసుకొంటూ కెరీర్ ని మెల్లమెల్లగా నిర్మించుకొంటోంది. తొలుత తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదేమో అనిపించింది. క్రమంగా ఆ పాత్ర పరిధి, ప్రాధాన్యం మారాయి. అనీష్ కురువిల్లా కు మరెవరో డబ్బింగ్ చెప్పారు. అది అతకలేదు.
సాంకేతికంగా చూస్తే.. శ్రీకాకుళం పాట బాగుంది. ఆ ప్రాంత వాసులు ఈ పాటని ఓన్ చేసుకొంటారు. ఐటెమ్ పాటలోనూ ఊపు ఉంది. కానీ.. అది అసందర్భంగా వచ్చిపోతుంది. మాటలు చాలా పేలవంగా అనిపిస్తాయి. ప్రాసలు తట్టుకోలేం. ‘రస్నాలూ, రసాయనాలూ నా దగ్గర కలపకు’, ‘టార్చర్ అంటే టార్చిలైట్ పెట్టి కొట్టడమా’, ‘ప్రపంచంలో ప్రమాదకరమైన పాయిజన్ ఏమిటో తెలుసా కన్ఫ్యూజన్’ ఇలాంటి ప్రయోగాలు చేశారు ఇందులో. నేపధ్య సంగీతం, కెమెరా పనితనం రెండూ యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోయాయి.
వెన్నెల కిషోర్ సినిమా అంటే నవ్వుకోవడానికి వెళ్తాం. ఆ నవ్వులు మిస్సయ్యాయి. తెరపై మిగిలిన పాత్రలు కామెడీ చేస్తున్నప్పుడు ట్రాజడీగా, ట్రాజడీ సీన్లు వస్తున్నన్నప్పుడు కామెడీ అనిపించడమే.. ఈ షెర్లాక్ హోమ్స్‌లో కనిపించే వైచిత్రి.