కాంగ్రెస్ పార్టీకి తీన్మార్ మల్లన్న చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ స్ట్రాటజీ అంతా తనదే అన్నట్లుగా ఆయన చేస్తున్న హడావుడితో నేషనల్ మీడియాలో కూడా కాంగ్రెస్ పార్టీ పరువు పోతోంది. ఆయనను ఇప్పటికే రేవంత్ రెడ్డి దూరం పెట్టారు. పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదు. ఆయన కూడా తాను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడం లేదు. సొంతగా బీసీ నినాదంతో ర్యాలీలు,సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నేతల్ని తిడుతున్నారు.
అయితే అల్లు అర్జున్ విషయానికి వచ్చేసరికి ఆయన తన మార్క్ రాజకీయంతో కాంగ్రెస్ ను వాడేసుకుంటున్నారు. ఓ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు తెలంగాణలో ఉండే వారికి పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలుసు. కానీ జాతీయ మీడియాకు అసలు తెలియదు. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్సీ .. అల్లు అర్జున్ పై ఫిర్యాదు అని ప్రచారం చేసేశారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వ స్ట్రాటజీ అన్నట్లుగా వారు మార్చేసి …చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నారు.
ఇక్కడ మల్లన్న రోజువారీ వీడియోలలో మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇతనికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీటు ఎలా ఇచ్చిందని అందరూ అనుకుంటారు. ఘోరంగా మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మల్లన్న ఇలా ఎందుకు చేస్తున్నారో ఆయన గురించి అవగాహన ఉన్న కొంత మందికి తెలుసు. కానీ ఇక్కడ ఆయన కాంగ్రెస్ కు డ్యామేజ్ చేస్తూండటమే అసలు విషయం. కానీ ఆయనను కాంగ్రెస్ నేతలు కంట్రోల్ చేయలేకపోతున్నారు.