న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్ లో భారత్ సభ్యత్వం కోసం అమెరికాతో సహా అనేక అగ్రదేశాలు మద్దతు ఇచ్చినప్పటికీ చైనా సైంధవుడిలాగ అడ్డుపడింది. భారత్ కి సభ్యత్వం దక్కనందుకు అమెరికా కూడా చాలా బాధపడుతోందని అమెరికా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. “ఎన్.పి.టి.ఒప్పందంపై భారత్ సంతకం చేయనప్పటికీ, దాని ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. కనుక అది ఒక అభ్యంతరంగా భావించలేము. ఇప్పుడు భారత్ కి ఎన్.ఎస్.జి.లో సభ్యత్వం దొరకకపోయినా, దానికి సభ్యత్వం వచ్చే వరకు అమెరికా గట్టిగా కృషి చేస్తుంది,” అని అన్నారు.
ఎన్.ఎస్.జి.లో సభ్యత్వం కోసం భారత్ మే 12న దరఖాస్తు చేసుకొంది. జూన్ 27,28 తేదీలలో దక్షిణ కొరియాలో జరిగిన ఎన్.ఎస్.జి. సభ్యదేశాల సమావేశంలో చైనా, టర్కీ తదితర కొన్ని దేశాలు అభ్యంతరం చెప్పడంతో భారత్ చేరికపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. ఎన్.ఎస్.జి. సభ్యదేశాలు భారత్ అభ్యర్ధనని తిరస్కరించకుండా సమావేశం ముగించాయి కనుక భారత్ కి పూర్తిగా తలుపులు మూసుకుపోయినట్లు కాదు. భారత్ కి ఎన్.ఎస్.జి.లో సభ్యత్వం కల్పించేందుకు అమెరికా గట్టిగా కృషి చేస్తానని చెపుతోంది కనుక ఏదో ఒకరోజు భారత్ కల సాకారం కావచ్చు.
అయితే తనకు ప్రయోజనం లేనిదే అమెరికా ఏ పని చేయదని అందరికీ తెలిసిందే. ప్రపంచ దేశాలకి తన ఆయుధాలు, యుద్ధ విమానాలు వంటి రక్షణ సామాగ్రిని అమ్ముకొని చాలా బారీ ఆదాయం కూడగట్టుకొంటున్న అమెరికా అభ్యర్ధన మేరకే మోడీ ప్రభుత్వం రక్షణ రంగంలో 100% ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకి వీలు కల్పించి ఉండవచ్చు. దాని వలన అందరికంటే ఎక్కువగా లబ్ది పొందేది అమెరికా సంస్థలే కనుక అందుకు బదులుగా ఎన్.ఎస్.జి.లో భారత్ కి సభ్యత్వం పొందేందుకు సహకరిస్తోందేమో?
ఈ అనుమానం నిజమా కాదా అనే విషయాన్ని పక్కన పెట్టి చూసినా, భారత్ రక్షణరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా సంస్థలు క్యూ కట్టవచ్చు. దాని వలన భారత్ కి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆయుధ సామాగ్రి దేశీయంగా పొందే అవకాశం కలుగుతుంది. ఆ సంస్థల నుంచి పన్నుల రూపేణా భారీ ఆదాయం కూడా సమకూరుతుంది. ఏవిధంగా చూసినా ఈ ఒప్పందం వలన ఇరుదేశాలకి లాభమే ఉంటుంది కనుకనే ఇరు దేశాలు పరస్పర సహకరించుకొంటున్నాయని భావించవచ్చు.