బీఆర్ఎస్ పార్టీకి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హఠాత్తుగా గుర్తుకు వచ్చాడు. ఆ పిల్లవాడ్ని పరామర్శించేందుకు హరీష్ రావు వెళ్లారు. అక్కడికి వెళ్లి ప్రభుత్వం అసలు ఆ పిల్లవాడ్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి పన్నెండు రోజుల వరకూ స్పందించలేదని.. ఒక్క మంత్రి కూడా ఆస్పత్రికి రాలేదని ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వం సంగతి పక్కన పెడితే మాట వరుసకు కూడా శ్రీతేజ్ గురించి బీఆర్ఎస్ ఇప్పటి వరకూ స్పందించలేదు. ఇంకా అల్లు అర్జున్ ను ఇంకా ఇరికించేందుకు శ్రీతేజ్ కు లైఫ్ సపోర్టు తీసేస్తారని ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నేతల కుట్రల ధీయరీలో శ్రీతేజ్ ను పావుగా వాడుకున్నారు కానీ.. ఎప్పుడూ పరామర్శలు లాంటివి చేయలేదు. సినీ ఇండస్ట్రీతో రేవంత్ రెడ్డి భేటీ సమయంలో హరీష్ రావు ఎందుకైనా మంచిదని శ్రీతేజ్ ను పరామర్శించారు.
బడా బాబుల వైపా.. లేకపోతే ఆ అభాగ్యులు, పేదల వైపా అన్న ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీకి డ్యామేజ్ జరగకుండా ఇలా హరీష్ రావు పరామర్శలు పెట్టుకుని ప్రభుత్వమే ఏమీ చేయలేదన్న విమర్శలు ప్రారంభించారని అంటున్నారు. బీఆర్ఎస్ తరపున అయినా ఎంతో కొంత విరాళం ఇచ్చి ఉంటే బాగుండేదన్న వాదన ఆస్పత్రిలో వినిపించింది. చివరికి వేణు స్వామి కూడా రెండు లక్షలు తెచ్చి ఇచ్చారు.