ఇలాంటి ఏడాది వస్తుందని బీఆర్ఎస్ అసలు ఊహించి ఉండదు. ఎప్పుడైనా మన పరిస్థితి తిరగబడితే ఎంత ఘోరంగా ఉంటుంది అని ఆలోచిస్తే.. ఇంత ఘోరంగా ఉంటుదంని మాత్రం అంచనావేసుకోని కూడా ఉండరు. కానీ కాలం శక్తివంతమైనది. పరిస్థితుల్ని ఒక్క సారిగా రివర్స్ చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కు 2024 అలాంటి అనుభవాల్నే నేర్పింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో నీరసంగా 2024లోకి ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఏడాది మొత్తంలో అన్నీ ఎదురుదెబ్బలే తగిలాయి. ఒక్కటంటే ఒక్క ఉత్సాహవంతమైన పరిణామం చోటు చేసుకోలేదు. మొదట కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకుపోయింది. అక్కడ తీహార్ జైల్లో నెలల తరబడి ఉన్నారు. తమ ఇంటి ఆడబిడ్డను అరెస్టు చేస్తే ఎక్కడా సంఘిభావం కనిపించకపోవడం బీఆర్ఎస్ పెద్దల్ని మరింతగా ఆందోళనకు గురి చేసింది. అందుకే ఆ అరెస్టుపై ఎక్కడా హడావుడి చేయలేదు. కవిత జైల్లో ఉండగానే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి.
అంతకు ముందు తెలంగాణలో పదిహారు, మహారాష్ట్రలో ఓ ఇరవై ఎంపీ సీట్లు గెల్చుకుని.. ఏపీలో వైసీపీ గెలిచే సీట్లను కలుపుకుని కేంద్ర ప్రభుత్వాన్ని డిసైడ్ చేయాలన్న ప్లాన్లో ఉండేవారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, కవిత అరెస్టు తర్వాత మహారాష్ట్ర దుకాణం సర్దేయాల్సి వచ్చింది. తెలంగాణలో ప్రజలు ఒక్క ఎంపీసీటు కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోవడం సంగతి తర్వాత అసలు ప్రధాన పార్టీగా కూడా గుర్తించలేదు. ఎనిమిది సీట్లలో డిపాజిట్ కోల్పోతే రెండింటిలో తప్ప మిగతా వాటిలో మూడో స్థానంలో నిలిచారు. ఇది అలాంటి ఇలాంటి పరాజయం కాదు. ఆ తర్వాత ఇయర్ ఎండింగ్ కు వచ్చే సరికి కేటీఆర్ పై కేసులు నమోదయ్యాయి. ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ ప్రభావంతో కేసీఆర్ అసలు బయటకు రావడం మానేశారు. కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై రోజుకో అంశంతో ఎదురుదాడి చేస్తున్నారు. యూట్యూబ్, ట్విట్టర్ లను వాడుకుని విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. అదే తమకు మళ్లీ అధికారంలోకి తెస్తుందని అనుకుంటున్నారు. ఏడాది మొత్తం ఎదురుదెబ్బలు తిన్న పార్టీగా నిలిచిపోయింది. భవిష్యత్ లో బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడని సంవత్సరం 2024.