కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడానికి నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ రెడీనే. నాగార్జున తరవాత సీరియర్ హీరోల్లో కొత్త దర్శకులకు ఎక్కువగా ఛాన్సులిచ్చింది బాలయ్యే. ఇప్పుడు బాలయ్య కోసం అనిల్ రావిపూడి.. తెగ కలవరపడిపోతున్నాడు. పటాస్, సుప్రీమ్ సినిమాలతో వరుసగా హిట్లు కొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు అనీల్ రావిపూడి. బాలయ్య వందో సినిమాకి డైరెక్ట్ చేసే అవకాశం ఒకానొక దశలో అనిల్ రావిపూడి చేతిలో పడింది. బాలయ్య కోసం రామారావుగారు.. అనే కథ సిద్దం చేశాడు అనిల్. అది బాలయ్యకూ బాగా నచ్చింది. కానీ వందో సినిమాగా అదొద్దు అనుకొన్న కారణంగా రామారావుగారు కథ పక్కన పెట్టారు.
అయితే అనిల్ – బాలయ్య కాంబినేషన్ మాత్రం పక్కా అని తెలుస్తోంది. 102వ సినిమాగా రామారావు గారు పట్టాలెక్కడం ఖాయమన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. అనిల్ రావిపూడి కూడా అదే చెబుతున్నాడు ”బాలకృష్ణగారితో సినిమా చేస్తా. కానీ అదెప్పుడన్నది ఆయన చేతుల్లో ఉంది. నేనైతే ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగిపోమన్నా దిగిపోతా” అంటున్నాడు. రామారావు గారు కథ ఓ పొలిటికల్ సెటైర్. ఎన్నికల ముందు… ఇలాంటి కథలకు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి 2019 ఎన్నికల ముందు.. రామారావు గారు కథని పట్టాలెక్కించాలన్నది బాలయ్య ఆలోచన. పైగా కేవలం రెండు నెలల్లో సినిమాని పూర్తి చేస్తానని అనిల్ కూడా మాటిచ్చాడట. దాంతో ఎప్పుడైనా సరే.. ఈ సినిమా పట్టాలెక్కేయొచ్చన్నది టాలీవుడ్ టాక్.