తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోయిన తరవాత… తెలుగు చిత్రసీమ కాస్త డైలామాలో పడింది. ఆడియో ఫంక్షన్ ఎక్కడ చేయాలి..?? అనేది వాళ్లకు పెద్ద టాస్క్‌గా మారిపోయింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి.. ఇలా వేదికలు ఎక్కువయ్యాయి. రెండు రాష్ట్రాల అభిమానుల్ని ప్రసన్నం చేసుకోవడానికి హైదరాబాద్ లో పాటల్ని విడుదల చేస్తే.. విశాఖలోనో, విజయవాడలోనో… సక్సెస్ మీట్లు పెట్టుకొంటున్నారు. అదే అక్కడ చేస్తే.. మిగిలిన ప్రమోషన్ అంతా ఇక్కడే చూసుకొంటున్నారు. ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ విషయంలోనూ ఇలాంటి మీమాంస ఎదురైంది. ఆడియోని ఖమ్మంలో రిలీజ్ చేయాలనుకొంటున్నారన్న వార్తలు బయటకు వచ్చాయి.
అయితే చిత్రబృందం ఇప్పుడు ఆడియో రిలీజ్ డేట్, ప్లేస్ ఫిక్స్ చేశారు. ఈనెల 22న హైదరాబాద్‌లో పాటల్ని విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. సక్సెస్ మీట్ మాత్రం విశాఖ, విజయవాడ ఈ రెండు వేదికల్లో ఓక చోట జరుపుతారట. ఆగస్టు మొదటి వారంలో చిత్రబృందం విజయవాడ గానీ, విశాఖగానీ చుట్టొస్తుంది. అలా.. ఎన్టీఆర్ కూడా సమన్యాయం పాటించాలని చూస్తున్నాడన్నమాట. అయితే పాటల వేడుకకు అతిథులెవరన్నదీ ఇంకా ఫిక్స్ కాలేదు.