ఫార్ములా ఈ రేసు విషయంలో విదేశాలకు తరలిపోయిన రూ. 55 కోట్ల వ్యవహారంలో టెక్నికల్ అంశాలతో తాను సేఫ్ అయ్యేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విషయంలో ఆయన తరపు లాయర్లు అంతా అధికారులే చూసుకోవాలని తనకేమీ సంబంధం లేదని సూటిగా చెప్పేశారు. అనుమతులు తీసుకోవడం, విదేశాలకు తరలింపు విషయంలో తన ప్రమేయం ఏమీ ఉండదన్నారు. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించాల్సి ఉందని చెల్లించాంచారని అంతే కానీ అవినీతి జరగలేదన్నారు.
ఇలాంటి వ్యవహారాల విషయంలో రాజకీయ నేతల ప్రమేయం ఎంత వరకూ కోర్టులో నిలబడుతుందన్న దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ నేతల అధికారాలు, ఆదేశాలు అన్నీ నిబంధనల ప్రకారం అమలు చేయడం అధికారుల బాధ్యత. అవి నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం అమలు చేయకూడదు. అలా చేస్తే ఇరుక్కుపోతారు . ఫార్ములా కేసు విషయంలో కేటీఆర్ నోటి మాట ద్వారా ఆదేశాలు ఇచ్చారు. దాంతో ఆయన ప్రమేయం నేరుగా లేదు. అర్వింద్ కుమార్ నేరుగా డబ్బులు బదిలీ చేశారు. ఇలా డబ్బులు బదిలీ చేయాలంటే ఓ ప్రక్రియ ఉంటుంది. అంటే బ్యాంకులో డబ్బులు డ్రా చేయడానికి ఓ వ్యక్తి వెళ్లి స్లిప్ ఇస్తే ఎంత మంది అప్రూవ్ చేస్తారో అంత కంటే ఎక్కువ ప్రాసెస్ ప్రభుత్వ విభాగాల్లో ఉంటుంది. కానీ అప్రూవల్స్ తర్వాత చూసుకుందాం.. ముందు డబ్బులు పంపేయమన్నారు కేటీఆర్. అలాగే చేశారు అధికారులు.
ఇప్పుడు కేటీఆర్ తనకు సంబంధం లేదని అప్రూవల్స్ ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అంటున్నారు. అధికారులు మాత్రం అంతా కేటీఆర్ చెబితే చేశామంటున్నారు. అర్వింద్ కుమార్ జరిగింది మొత్తం చెప్పి కావాలంటే తాను అప్రూవల్ గా మారుతానని .. జైలుకు మాత్రం పంపవద్దని ప్రభుత్వ పెద్దలను వేడుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కేటీఆర్ అర్వింద్ కుమార్ ను పూర్తి స్థాయలో ఇరికించేలా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి టెక్నికల్ గ్రౌండ్స్ మీద కేటీఆర్ బయటపడతారా లేకపోతే అంతా చేసేసి అధికారుల మీద తోసేస్తే ఎలా అని షాక్ తగులుతుందా ?