మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించి ప్రత్యేకంగా ఘాట్ నిర్వహించనున్నారు. కేంద్రం కేటాయించిన స్థలంపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేసి శక్తిస్థల్ వంటి చోట్ల కేటాయించాలని డిమాండ్ చేసింది మన్మోహన్ ను అవమానిస్తున్నారన్నట్లుగా ప్రజల్లోకి సందేశాన్ని పంపాలనుకుంది. అయితే ఇక్కడ అందరికీ ముఖ్యంగా తెలుగువారికి ఒకటే గుర్తుకు వస్తోంది. దేశాన్ని దివాలా స్థితిలో గట్టెక్కించిన అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు ఎందుకు ఆ గౌరవం కాంగ్రెస్ దక్కనీయలేదు అనే.
పీవీ నరసింహారావు చనిపోయినప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు. సహజంగానే మాజీ ప్రధానులందరి అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహిస్తారు. ఘాట్ నిర్మించి సందర్శలకు అనుమతిస్తారు. జయంతి, వర్థంతులు వంటి సందర్భాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారలోనే ఉన్నప్పటికీ ఆయనకు ఢిల్లీలో అంత్యక్రియలు చేయలేదు. ఉమ్మడి ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. తాము అత్యంత గౌరవంగా చేస్తామని వైఎస్ అంటే హైదరాబాద్ పంపించేశారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మరో వివాదం.
అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తమ పార్టీ తరపున పదేళ్లు సీఎంగా చేసి..దేశ గతిని మార్చిన పీవీకి మాత్రం కనీస గౌరవం ఇచ్చేందుకు మనసు రాలేకపోయింది. రాజకీయంగా ఆయన గాంధీ కుటుంబాన్ని ఎదగకుండా చేసేందుకు ప్రయత్నించారన్న ఉద్దేశంలో ఇలా కక్ష పెట్టుకుని వ్యవహారించారు. ఇప్పుడు మన్మోహన్ విషయంలో మాత్రం లేనిపోని రాజకీయాలు మాత్రం చేస్తున్నారు.