ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే కడప మాది. కడపలో మేం చెప్పింది జరగాల్సిందే అనే వైసీపీ మోనార్కుల భరతం పట్టేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఎవరైనా తోక జాడిస్తే కట్ చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కడప గడ్డపై నుంచి గట్టి హెచ్చరికలు జారీ చేయనున్నారు. గాలీవీడు ఎంపీడీవోపై దాడి చేసిన వైసీపీ నేత వ్యవహారంతో ఇక అలాంటి అరాచకాలు చేసే వైసీపీ నేతలకు షాక్ ట్రీట్ మెంట్ ఉండబోతోందని సంకేతాలను పవన్ నేరుగా కడప పర్యటనను పెట్టుకోవడం ద్వారా ఇస్తున్నారు.
ఉమ్మడి కడప జిల్లాలను వైసీపీ నేతలు తమ అడ్డాగా మార్చుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వ అధికారులను భయపెట్టి తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మాట వినకపోతే నేరుగా దాడిచేయడం, కుటుంబాలను టార్గెట్ చేయడం చేస్తూంటారు. వారితో గొడవలు ఎందుకులే అని చాలా మంది అధికారులు సేల్ గేమ్ ఆడతారు. అయితే ఇలా రుబాబుగా చేసే వారిని ఇక సహించేది లేదని గాలివీడు ఎంపీడీవోపై దాడి చేసిన వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడ్ని చొక్కా పట్టుకుని లాక్కుని పోయిన వైనం నిరూపిస్తోంది.
ప్రభుత్వ అధికారులు భయపడకుండా ఉంటే వైసీపీ నేతలకు కాళ్లూ చేతులూ ఆడవు. వారు భయపడకుండా తాను భరోసాగా ఉంటానని చెప్పేందుకు పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడం వైసీపీకి ఇబ్బందికరమే. ఇక నుంచి అధికారులు ఎవరైనా వైసీపీ మాటలు వినకుండా ధైర్యంగా నిలబడితే ప్రభుత్వం అండగా ఉంటుందన్న సంకేతాలను పంపుతున్నారు .
గతంలో కడపలో ఎవరు పర్యటించినా దాడులు చేయడాన్ని ఓ సంస్కృతిగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చి స్వేచ్చా వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల వైసీపీ కడపలోనూ బలహీనపడే అవకాశాలు ఉన్నాయి.