2023లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సంచలనం సృష్టిస్తుందని అనుకున్నారు. దానికి తగ్గట్లుగా హైప్ వచ్చింది. కానీ అది గాలి బుడగలా తేలిపోయింది. దానికి కారణం హైకమాండ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలే. అయితే 2024లోనూ ఆ పార్టీకి అన్నీ కలసి వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎనిమిది పార్లమెంట్ సీట్లను గెల్చుకుంది.అంతే కాదు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెల్చుకున్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల నాటికి మొత్తం నలభైకిపైగా సెగ్మెంట్లలో ఆధిపత్యం చూపించింది. అంటే బీజేపీ సీరియస్ గా పని చేసుకుంటే.. ఎదగడానికి అవకాశం ఉందని ప్రజలు చెప్పారు.
ఎనిమిది పార్లమెంట్ సీట్ల గెలుపుతో వచ్చిన ఊపును కొనసాగించడంలో బీజేపీ విఫలం అయింది. పార్టీకి అధ్యక్షుడ్ని నియమించలేక హైకమాండ్ వదిలేసింది. అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండటంతో ఆయన వీకెండ్స్ లో కూడా దృష్టి పెట్టలేకపోతున్నారు . సీనియర్ నేతలంతా ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. హైడ్రా, మూసీ సహా అనేక ప్రాజెక్టుల విషయంలో బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం దీనికి నిదర్శనం. ప్రత్యేకంగా పార్టీ స్టాండ్ ప్రకటించినా ఈటల రాజేందర్ వంటి నేతలు తమ ప్రయత్నాలు .. ప్రకటనలు చేస్తూనే పోయారు.
2023లో వచ్చినట్లే 2024లోనూ తెలంగాణ బీజేపీకి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు. ఎనిమిది పార్లమెంట్ సీట్లు రావడం ఒక్కటే గుడ్డిలో మెల్ల. వాటిని ఉపయోగించుకుని బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు మాత్రం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయలేదు. అయితే బీజేపీకి చాలా స్కోప్ ఉందని మాత్రం 2024 నిరూపించింది. ఆ పార్టీ నేతలు 2025లో దాన్ని ఉపయోగించుకుంటారా.. ఎప్పటిలాగే.. బీఆర్ఎస్కు గ్రౌండ్ వదిలేస్తారా అన్నది తేలిపోతుంది.