హైకోర్టు విభజనపై కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పందిస్తూ, “దీనిపై కూడా మా ప్రభుత్వాన్నే నిందించడం తగదు. హైకోర్టు విభజనకి మేము ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదు. హైకోర్టు విభజనతో సహా సెక్షన్:9,10 ల క్రింద వచ్చే సంస్థల విభజన, కృష్ణా జలాల పంపిణీ ప్రతీ దానిపై మేము తెలంగాణా ప్రభుత్వంతో చర్చించడానికి సిద్దంగా ఉన్నాము. అమరావతిలో హైకోర్టు కోసం కేటాయించిన భూమిని కేంద్ర కమిటీ వచ్చి చూసి వెళ్ళింది. విభజన చట్ట ప్రకారం హైకోర్టుని నిర్మించుకోవడానికి కేంద్రం నిధులు మంజూరు చేయవలసి ఉంది,” అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైకోర్టు విభజన జరగకుండా అడ్డుపడుతూ తెలంగాణా రాష్ట్రంపై కర్ర పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని తెరాస నేతలు చేస్తున్న ఆరోపణలపై ఈరోజు ఆయన కూడా స్పందించారు.
“దీని గురించి కెసిఆర్ తో మాట్లాడేందుకు నాకేమీ భేషజాలు లేవు. హైకోర్టు విభజనతో సహా అన్ని సమస్యలపై ఆయనతో మాట్లాడేందుకు నేను సిద్ధం. విభజన తరువాత అన్నీ వదులుకొని వచ్చిన మేము హైకోర్టు విభజనకి ఎందుకు అడ్డుపడతాము. దాని కోసం తెలంగాణాతో కీచులాడవలసిన అవసరం మాకేమిటి? అయితే హైకోర్టు విభజన అనేది మా ఇద్దరి చేతుల్లోనే లేదు. కేంద్రం, సుప్రీం కోర్టు సహకరించాలి. అప్పుడే సాధ్యం అవుతుంది. డిల్లీలో ఏపి భవన్ తెలంగాణాకే చెందుతుందని వాదించడం సరికాదు. అది అందరూ కలిసి నిర్మించుకొన్నది. రెండు రాష్ట్రాలు సహకరించుకొంటూ అభివృద్ధిలో పోటీపడాలి. ఎప్పుడూ కీచులాడుకోవడం వలన అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది,” అని అన్నారు.
వారిరువురి మాటలు గమనించినట్లయితే హైకోర్టు విభజనపై చర్చని మిగిలిన సమస్యలతో ముడిపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఉదాహరణకి కృష్ణా జలాల పంపకాల సమస్యకి హైకోర్టు విభజన సమస్యకీ అసలు సంబంధమే లేదు. రెండు వేర్వేరు సమస్యలు. వాటికి వేర్వేరు కారణాలు..పరిష్కారాలు ఉంటాయి. అలాగే సెక్షన్: 9,10ల క్రింద వచ్చే సంస్థల విభజనపై చర్చని కూడా మిగిలిన వాటితో ముడిపెట్టలేము. అన్ని సమస్యలనీ దేనికది వేర్వేరుగా పరిష్కరించుకోవలసిందే. కానీ ఒక సమస్యని వేరొక సమస్యతో ముడిపెట్టడం అంటే బేరం ఆడుతున్నట్లుగానే భావించవలసి ఉంటుంది. మీరు ఫలాన సమస్యపై వెనక్కి తగ్గితే మేము ఫలాన సమస్యపై వెనక్కి తగ్గి సహకరిస్తామని సూచిస్తున్నట్లుగానే భావించవచ్చు.
హైకోర్టు విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పరచుకొంటే దాని వలన ఆంధ్రప్రదేశ్ కి లాభమే తప్ప నష్టం ఉండదు. సచివాలయం, శాసనసభ, విధానసభ కోసం తాత్కాలిక సచివాలయం నిర్మించుకొంటున్నప్పుడు హైకోర్టు కోసం మరో భవనం ఎందుకు నిర్మించుకోలేము? తాత్కాలిక సచివాలయం భవనం కోసం కేంద్రప్రభుత్వమేమీ నిధులు మంజూరు చేయలేదు కదా? అలాగే హైకోర్టు నిర్మాణం కోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు కేటాయించడానికి సిద్దపడితే హైకోర్టు ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అవసరమైతే తెలంగాణా ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవచ్చు కదా! హైకోర్టు శాస్వితభవనం నిర్మించుకోదలిస్తే దానికి అవసరమైన నిధులు విడుదల చేసేందుకు కేంద్రం ఎలాగూ సిద్ధంగా ఉంది. కనుక ఇద్దరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యని తెగే వరకు లాగకుండా సత్వరమే తగిన నిర్ణయం తీసుకొంటే మంచిది.