పవన్ కల్యాణ్ మన్యం పర్యటనను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అది సున్నితమైన ప్రాంతం కావడంతో పోలీసులు అసలు పర్యటన విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోమన్నారు.కానీ పవన్ వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో ఏర్పాట్లు చేశారు. పర్యటన సక్సెస్ అయింది. అయితే అసలు భద్రత ఎంత డొల్లగా చేశారన్నది ఇప్పుడు బయటపడింది. ఓ వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్నని చెప్పుకుని పవన్ వెంటే తిరిగాడు. తీరా చూస్తే అతను ఫేక్ ఐపీఎస్ అని తేలింది. ఇప్పుడీ వ్యవహారం సంచలనం అవుతోంది.
సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐ.పి.ఏస్ ఆఫీసర్ లా ప్రవర్తించాడో వ్యక్తి. పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలుకు ఫోజులు ఇచ్చాడు. అధికారులు కూడా అతను నిజమైన ఐపీఎస్ అనుకున్నారు. అయితే ఫోటోలు బయటకు రావడంతో అసలు ఆ ఐపీఎస్ ఎవరు అన్న డౌట్ వచ్చింది. డిపార్టుమెంట్ మొత్తం ఆరా తీశారు. అసలు ఆ మొహంతో పోలీసు అధికారి ఎవరూ లేరని తేల్చారు. దీంతో నకిలీ అని గుర్తించారు. వెంటనే అతను ఎవరో గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు విజయనగరం రూరల్ పోలీసులు.
నకిలీ ఐ.పి.ఏస్ ఆఫీసర్ గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తిచారు. ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు.. విచారణ చేపట్టారు. ఏ ఉద్దేశంతో అతను పవన్ కల్యాణ్ తో కలిసి ఐపీఎస్‌గా ఫోజులుకొట్టారో బయటకు లాగుతున్నారు. అయితే ఇది చిన్న సెక్యూరిటీ బ్రీచ్ కాదు. ఎవరైనా హాని తలపెట్టాలన్న ఉద్దేశంతో ఇలా చేరి ఉంటే పరిస్థితి ఏమయ్యేదన్న ఆలోచన వస్తేనే పోలీసు వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఎందుకు గుర్తించలేకపోయారన్నదానిపైనా విచారణ జరుపుతున్నారు.