ఏపీ కొత్త చీప్ సెక్రటరీగా విజయానంద్‌ను చంద్రబాబు ఖరారు చేశారు. సీనియార్టీలో శ్రీలక్ష్మి ముందున్నారు కానీ ఆమెను చంద్రబాబు అన్ ఫిట్ గా భావించి పక్కన పెట్టేశారు. ఆమెకు ఇప్పటి వరకూ పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. తర్వాత జాబితాలో సాయిప్రసాద్, విజయానంద్ ఉన్నారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న సమయంలో వీరిద్దరూ ఆయనకు సన్నిహితంగానే ఉన్నారు. కష్టపడి పని చేసేవారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరితో చాలా ఘోరమైన పనులు చేయించారు.
కేసుల భయమో.. మరొకటో కానీ జగన్ రెడ్డి చెప్పిన చాలా నిబంధనలకు విరుద్దమైన పనులు వీరు చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై కేసులు పెట్టడానికి కూడా వీరు సహకారం అందించారని చెబుతారు. ఈ క్రమంలో ఎవర్ని చీఫ్ సెక్రటరీగా ఎంచుకుంటారన్నదానిపై చర్చ ప్రారంభమయింది. సాయిప్రసాద్ పేరు ఎక్కువగా వినిపించింది. అయితే ఇటీవలి కాలంలో టీడీపీ క్యాడర్ ఐదేళ్ల కాలంలో ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారో వారి పేర్లు పదవులకు ముందుకు వచ్చినప్పుడు ఉద్రిక్తంగా స్పందిస్తున్నాయి.సాయి ప్రసాద్ పేరుపైనా అదే తరహా ప్రచారం జరిగింది.
చంద్రబాబు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నారో లేకపోతే ఎక్కువ రోజులు సీఎస్ గా ఉండే అధికారి ఉండాలని అనుకున్నారో కానీ విజయానంద్ వైపు మొగ్గినట్లుగా తెలుస్తోంది. ఏడాది చివరి రోజున నీరబ్ కుమార్ ప్రసాద్ పదవి విరమణ చేస్తున్నారు. ఆ రోజున విజయానంద్ కు బాధ్యతలు అప్పగించనున్నారు. అధికారిక ఉత్తర్వులు ఆదివారం వెలువడే అవకాశాలు ఉన్నాయి.