సోషల్ మీడియా కేసుల్లో వందల మంది అరెస్టు అవుతున్నారు. రాజకీయపార్టీలు చెప్పాయని న్యాయమూర్తుల దగ్గర నుంచి ఇతర వ్యక్తుల కుటుంబాల వరకూ అందర్నీ దూషిస్తూ అదే భావ ప్రకటనా స్వేచ్చ అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. ఇతరుల్ని తిట్టడం భావ ప్రకటనా స్వేచ్చ కాదని పోలీసులు జైళ్లకు పంపుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో పలు చోట్ల ప్రత్యేకమైన ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చెడు ప్రచారం వద్దంటూ… మూడు కోతుల బొమ్మలతో రాజధాని అమరావతితో పాటు తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఏపీలోని ప్రధాన నగరాల్లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అసత్య ప్రచారాలకు, దూషణలకు చెక్ పెడదామని నినాదాలను ఈ ఫ్లెక్సీల్లో పెట్టారు. చెడు విషయాలు పోస్ట్ చేయవద్దు.. నైతికంగా పతనం కావొద్దు అని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిస్తున్నారు. అందరికీ అర్థమయ్యేలా ఆంగ్లం, తెలుగు భాషల్లో వీటిని ఏర్పాటు చేశారు.సోషల్ మీడియాను మంచి కోసం వాడుదాం అంటూ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ద్వారా చైతన్యం తెచ్చేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. చిన్న చిన్న పోస్టర్లు కాదు ఏకంగాపెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ ఫ్లెక్సీలు చర్చనీయాంశం అవుతున్నాయి. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న అనర్థాలు.. మంచి కోసం ఎలా ఉపయోగించుకోవాలన్న చర్చ కూడా వీటి వల్ల నడుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. వీటిని ఎవరు ఏర్పాటు చేశారనేదానిపై మాత్రం స్పష్టత లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే.. జారీ చేసిన వారు సమాచార, ప్రచార సంబంధాల శాఖ అని వేసుకునేవారు. కానీ అలా వేయలేదు. ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసి ఉంటే అంత ఖర్చుపెట్టి పబ్లిసిటీ చేసుకోకుండా ఉంటారా?. కానీ చేసుకోలేదు. అందుకే ఈ ఫ్లెక్సీలు మరింత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. కానీ నీతులు చెబితే వినే రోజులు పోయాయని.. కానీ ఓ ప్రయత్నం మాత్రం చేస్తున్నారని కొందరు నిట్టూరుస్తున్నారు.