చంద్రబాబు ఎంత తీరిక లేకుండా ఉన్నా సరే ఎమ్మెల్యేలను ఓ కంట కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎప్పటికప్పుడు వారి గురించి నివేదికలు తెప్పించుకుంటున్నారు. తప్పు చేస్తున్నారు.. రాంగ్ ట్రాక్‌లోకి వెళ్తున్నారు అనుకున్న ప్రతి ఒక్కరినీ పిలిచి క్లాస్ తీసుకుంటున్నారు. తాజాగా కొంత మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబును కలవాలని ఫోన్ వచ్చింది. ఉత్సాహంగా వెళ్లిన వాళ్లకు తాము చేసిన నిర్వాకాలు చెబుతూంటే.. అవాక్కయ్యారు.
ఎన్నిసార్లు చెప్పిన కొంత మంది ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవడం లేదని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. కొందరు ఎమ్మెల్యేలు దందాలకు తెరలేపారని.. మరికొందరు తమ వ్యాపారాల్లో తీరిక లేకుండా గడుపుతూ ప్రజలకు దూరం అవుతున్నారని గుర్తించారు. ఇలా ప్రజా సేవను సెకండ్ ప్రయార్టీగా భావిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని పిలిచి సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకుంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాడానికి కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అనే రెండు అంశాలు పార్టీపై ప్రభావం చూపిస్తాయి. రెండింటిని బ్యాలెన్స్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల అంశం నేరుగా ప్రజలతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తీరు మార్చుకోని వారి విషయంలో చాలా కఠినంగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు.