డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతి నెలా ఓ జిల్లాలో పర్యటించాలని అనుకుంటున్నారు. ఇందు కోసం ఆయన కార్యాచరణ రెడీ చేసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పాలనను అర్థం చేసుకోవడంతో పాటు ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా ఉందన్న అభిప్రాయం కల్పించాలని ఆయన అనుకుంటున్నారు. ఇటీవల మన్యం పర్యటన వల్ల మంచి ఫలితం వచ్చిందని తమ కోసం ప్రభుత్వం వచ్చిందన్న భావన గిరిజనులలో ఏర్పడిందని జనసేన వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులను సమీకరించుకుని అయినా కీలక పనులను చేపడుతున్నారు. ఐదేళ్ల పాటు పక్కన పడేసిన మౌలిక సదుపాయాల పనులు ప్రారంభించాయి. సిమెంట్ రోడ్ల నిర్మాణం, గుంతలు పడిన రోడ్లను బాగు చేయడం, తాగునీటి కి సంబంధించిన చేయాల్సిన రిపేర్లు అన్నీ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజల్లో సానుకూలత ఉంది. అదే సమయంలో ప్రజలకు ప్రభుత్వం దగ్గరగా ఉందని.. అందుబాటులో ఉందని అనిపించాలంటే.. మరింత ఎక్కువగా ప్రజల మధ్య నుంచి పని చేయాలని భావిస్తున్నారు.
పవన్ కల్యాణ్ ఆ విషయంలో మరింత ఆసక్తిగా ఉన్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం కొత్త. పరిపాలన కూడా కొత్తే. పరిపాలనా వ్యవస్థను అర్థం చేసుకోవడంతో పాటు కింది స్థాయి సిబ్బంది వరకూ ప్రభుత్వం పట్ల అప్రమత్తంగా ఉండాలంటే..ఇలా పర్యటనలు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. జనవరి నుంచి పవన్ జిల్లాల పర్యటన ప్రారంభించనున్నారు.