డిసెంబరు అంతా ‘పుష్ప 2’ ఆక్రమించేసింది. కొన్ని సినిమాలు వచ్చినా ప్రభావం చూపించలేకపోయాయి. 2024 చివరి వారం కూడా చాలా బేలగా గడిచింది. బాక్సాఫీసు దగ్గర సందడే కనిపించలేదు. ‘పుష్ప 2’కు లాంగ్ రన్ ఉన్నా – టికెట్లు తెగడం లేదు. కొత్త యేడాది తొలి వారం కూడా ఇదే పరిస్థితి. జనవరి తొలి వారం బాక్సాఫీసు ఖాళీ. సినిమాలేం లేవు. అందరి దృష్టీ సంక్రాంతిపైనే. జనవరి 10 నుంచి అసలైన వేట మొదలవుతుంది. అక్కడి నుంచే తెలుగు సినిమా క్యాలెండర్ కు శ్రీకారం చుట్టినట్టు అనుకోవాలి. ఆ తరవాత ‘డాకూ మహరాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వరుస కడతాయి. ప్రతీ సంక్రాంతికీ 4 సినిమాలైనా ఉండేవి. ఈసారి మూడింటికే పరిమితం చేశారు. మూడూ పెద్ద స్టార్లవే కాబట్టి.. ఈ సీజన్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
తొలి వారంలో సినిమాల్లేకపోయినా `హిట్లర్` రూపంలో రీ – రిలీజ్ వుంది. జనవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. వరుస ఫ్లాపుల తరవాత చిరంజీవికి దక్కిన విజయం ఇది. ‘హిట్లర్’ తరవాత చిరు స్పీడందుకొన్నారు. ఆ తరవాత వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టారు. అందుకే చిరు అభిమానులకు ‘హిట్లర్’ గుర్తుండిపోతుంది. ‘అబీబీ..’ పాటలో చిరు వేసిన స్టెప్పులు మెమరబుల్. కాకపోతే చిరు నుంచి ఆశించే మాస్ మూమెంట్స్ ఈ సినిమాలో ఉండవు. ఇదో ఫ్యామిలీ డ్రామా. రీ రిలీజుల్లో మాస్, కమర్షియల్ సినిమాల హవా ఎక్కువ. హిట్లర్ లాంటి సెంటిమెంట్ బొమ్మ విడుదల చేయడంలో ఆంతర్యం అర్ధం కావడం లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్, బావగారూ బాగున్నారా, అన్నయ్య లాంటి సినిమాలకైతే.. మరిన్ని టికెట్లు తెగేవి.