కేసులు పెడుతున్నారు కానీ అరెస్టులు చేయడం లేదని, బెయిల్స్ తెచ్చుకునేవరకు వైసీపీ నేతలకు అవకాశం కల్పిస్తున్నారని ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానం మెల్లగా ఆ పార్టీ నేతలకు లభిస్తోంది. ఒక సారి కేసు పెట్టి అరెస్టు చేస్తే ఏమి వస్తుంది ?. వారిని భయం భయం బతికేలా చేయడం.. కేసుల వల ఎప్పుడూ అలా పొంచి ఉండేలా చేయడం కన్నా వారికి పెద్ద శిక్ష ఏముంటుంది?. వారు భయంతో వణికిపోతూ అజ్ఞాతంలో గడుపుతూ ఉండటంతో ఎక్కువ క్షోభ అనుభవిస్తారు. జైలుకెళ్లి వారానికో..రెండు వారాలకో బెయిల్ తెచ్చుకుని మళ్లీ రెచ్చిపోయి రాజకీయం చేస్తారు. ఇదే పాయింట్ టీడీపీ హైకమాండ్ పట్టుకుందని అనుకోవచ్చు.
అరెస్టులే లక్ష్యమైతే ఎంత సేపు ?
అరెస్టులే లక్ష్యమైతే తాము వచ్చిన రెండో రోజునే జగన్ రెడ్డిని లోపలేసేవాళ్లమని చంద్రబాబు గుర్తు చేశారు. సెకీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందం విషయంలో చర్యలు తీసుకోవాలంటే రాత్రికి రాత్రి అరెస్టు చేయవచ్చని అంటున్నారు. కానీ తమ లక్ష్యం అరెస్టులు కాదని స్పష్టం చేస్తున్నారు. అలాగని వదిలేస్తామని అనుకోవద్దని.. చట్ట పరంగా అరెస్టు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వదిలేది లేదంటున్నారు. వైసీపీ నేతలు చేసిన అరాచకాలపై గత ఆరు నెలలుగా ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియా కేసుల దగ్గర నుంచి పేర్ని నాని బియ్యం మాయం కేసు వరకూ ఎన్నో ఉన్నాయి. ఇంకా ఎన్నెన్నో వెలుగులోకి రాబోతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ నేతలు బయటకు రావడానికే జంకుతున్నారు.
భయం భయంగా అజ్ఞాతంలో ఉండటమే పెద్ద శిక్ష
తప్పు చేసి మళ్లీ ఎదురుదాడి రాజకీయం చేయాలనుకున్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టేందుకు సిద్దంగా లేరని ప్రస్తుత టీడీపీ రాజకీయవ్యూహం చూస్తే అర్థమవుతుంది. ముఫ్పై ఏళ్లు అధికారం ఉంటుందని జగన్ రెడ్డి చెబితే గుడ్డిగా నమ్మేసి అడ్డగోలుగా దోచేసుకుని ఇప్పుడు రోడ్డున పడ్డారు. అయితే చంద్రబాబు జగన్ లా వాళ్లను రాత్రికి రాత్రి ఎత్తేయాలని అనుకోవడం లేదు. చట్టపరంగానే ఏదైనా చేయాలనుకుంటున్నారు. అందుకే వారికి కాస్త రిలీఫ్ వస్తున్నట్లుగా కనిపిస్తోంది. వాస్తవానికి వారంతా చట్టపరంగా బిగుసుకుపోతున్నారు. తప్పించుకోలేని పరిస్థితికి వెళ్తున్నారు.
ఆలోచనతో చేసే రాజకీయాలే మైండ్ గేమ్
జగన్ మోహన్ రెడ్డికి ఆలోచన తక్కువ.. తాత్కాలిక సంతృప్తి కోసం రాజకీయ ప్రత్యర్థుల్ని జైళ్లలో పెడతారు. ప్రాపర్ కేసులు ఉండవు. అరెస్టు చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ బయట పెట్టడం వంటి పనులు చేస్తూంటారు. ఇలా చేసి ఆయన వ్యవస్థల్ని దుర్వినియోగం చేసినట్లుగా ప్రజల చేత ఛీ కొట్టించుకున్నారు. కొంత మంది టీడీపీ కార్యకర్తలు .. చంద్రబాబు కూడా అలాగే చేయాలని అనుకుంటున్నారు. కానీ ఆలోచనతో సమయానుకూలంగా చేసే పనుల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చంద్రబాబు చూపిస్తున్నారని అనుకోవచ్చు. అదే టీడీపీ, వైసీపీకి తేడా !