కావాలంటే కడపలో క్యాంపు ఆఫీసు పెట్టుకుని మరీ వైసీపీ నేతల అరాచకాలను అణిచి వేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆయన తాను ఎంత సీరియస్ గా ఉన్నాను అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ పదం వాడి ఉంటారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఓవర్ గా రియాక్టవుతున్నారు. వీరి తీరుతో పవన్ కల్యాణ్ నిజంగానే క్యాంపు ఆఫీస్ ప్రారంభించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పవన్ కల్యాణ్ క్యాంపు ఆఫీస్ ప్రకటన చేసిన తర్వాత ఎక్కడో ఎందుకు పులివెందులలో వివేకాను హత్య చేసిన ఇంటిలోనే పెట్టాలని కొంత మంది వైసీపీని ఉడికించడానికి పవన్ కు సలహాలు ఇచ్చారు. ఆ ఇంటి వైసీపీ నేతలను కంట్రోల్ చేయడానికి పవన్ ఆఫీసు పెడతానంటే .. వైఎస్ వివేకా కుమార్తె సునీత కూడా ఇచ్చేస్తారని చెబుతున్నారు. పవన్ ఇలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటారేమోనని వైసీపీ నేతలు రంగంలోకి దిగి విమర్శలు ప్రారంభించారు. తమను కంట్రోల్ చేయడానికి క్యాంప్ ఆఫీసు పెడతారా.. తాము ఏమైనా చిన్న పిల్లలమా అని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా ముందుకు వచ్చేశారు.
కడపలో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి క్యాంపు ఆఫీసు పెడితే స్వాగతిస్తామని చెప్పుకొచ్చారు. మాతో యుద్ధం చేయాలనుకుంటే మీకు ప్రభుత్వం ఉండాలని..మాకు అవసరం లేదని పెద్ద పెద్ద డైలాగులు కూడా చెబుతున్నారు. ఆయనతో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా పవన్ కడపలో దూకుడుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు వ్యూహంతోనే పవన్ .. కడపలో వైసీపీని తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్నారు.