వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపులకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. కానీ 67మంది ఎమ్మెల్యేలలో 20 మందిని చేజార్చుకోవడం వైకాపాకి చాలా పెద్ద దెబ్బగానే భావించవచ్చు. తెదేపాలో ఇమడలేక ఇబ్బందిపడుతున్న వారు మళ్ళీ తిరిగి రాదలిస్తే వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామని వైకాపా చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. పార్టీ మారగానే తమపై అనుచితమైన విమర్శలు చేయడం, అనర్హత వేటువేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం వంటివి వారు మళ్ళీ వైకాపా వైపు చూడకుండా చేశాయని చెప్పవచ్చు. అదే…వైకాపా మరికొంత కాలం సంయమనం పాటించగలిగి ఉంటే తప్పకుండ ఒకరిద్దరు ఎమ్మెల్యేలయినా వెనక్కి తిరిగి వచ్చి ఉండేవారేమో?
వైకాపాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా, పార్టీలో సీనియర్ నేతలుగా గౌరవం అందుకొన్న భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూలని కూడా విడిచిపెట్టకుండా వారిపై కూడా వైకాపా తొందరపడి విమర్శలు గుప్పించడంతో వారి ఆత్మాభిమానం దెబ్బతింది. అదే సమయంలో వారిరువురూ తెదేపా పట్ల తమ విధేయతని చూపవలసిన అవసరం కూడా ఏర్పడటంతో, తప్పనిసరిగా వైకాపాపై ఎదురుదాడికి దిగారు.
“మేము రాజీనామాలు చేసి ఉపఎన్నికలలో పోటీ చేసి గెలవగలము. గెలిస్తే వైకాపాని మూసేసుకొంటారా?” అని భూమా నాగిరెడ్డి సవాలు విసిరారు. మళ్ళీ తమపై అనవసరంగా విమర్శలు చేస్తే సహించబోమని గట్టిగా హెచ్చరించారు. పార్టీ ఫిరాయించిన వారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి సహజంగానే కొంచెం ఇబ్బంది పడతుంటారు. కనుక వారిని మీడియా ముందుకు రప్పించగలిగితే చాలని వైకాపా భావిస్తే అసహజమేమీ లేదు. వారికి ఆ పరిస్థితి కలిగేలా వైకాపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వారికి మళ్ళీ మరో సవాలు విసిరారు. “తెదేపాలో చేరిన 20 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకి రాజీనామాలు చేసి ఎన్నికలలో పోటీచేసి మళ్ళీ గెలిచినట్లయితే నేను రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకొంటాను. పలమనేరు వైకాపా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని ఏదో ప్రలోభపెట్టి తెదేపాలో చేర్చుకొన్నా ఆయన కూడా పోటీ చేస్తే మళ్ళీ గెలవలేరు. తెదేపా ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు ఆకర్షించాలని ప్రయత్నోస్తోంది? అంటే రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం ఉండకూడదనే..కానీ అది ఎన్నటికీ సాధ్యం కాదు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా వాటిలో వైకాపాయే విజయం సాధిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. కనుక ఆ 20 మంది మళ్ళీ గెలవడం అసాధ్యం. గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీ!” అని అన్నారు.
వైకాపా నుంచి పెద్దిరెడ్డో మరొకరో తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలని ఈవిధంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వైకాపా ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ వారు తమ ఎమ్మెల్యే పదవులకి రాజీనామాలు చేయరు..ఉపఎన్నికలలో పోటీ చేయరు. ఈ సంగతి రెండు పార్టీలకి తెలుసు. కానీ తమతమ పార్టీ అధినేతలని సంతృప్తి పరిచేందుకు ఈ తంతులో పాల్గొనక తప్పదు.