నా పనుల వల్ల కుటుంబసభ్యులంతా బాధపడుతున్నారు. అందుకే చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నాను అని.. ఇటీవల పెద్ద ఫ్లెక్సీ పెట్టి మరీ జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా ముందు అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఓనర్లకు క్షమాపణలు చెప్పారు. ఆయన క్షమాపణలు చెప్పే వ్యక్తిత్వం ఉన్న నేత కాదు. మరి ఎందుకు చెప్పారు ?. ఆయన తీరుతో కుటుంబం కూడా ఇబ్బంది పడుతోంది. వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో చెప్పాల్సిన వచ్చింది. అయినా ఆయన ఇతర విషయాల్లో తగ్గడం లేదు. తాడిపత్రిలో బీజేపీ నేతలు మహిళల కోసం న్యూ ఇయర్ ప్రోగ్రాం పెట్టారని వారిపై బూతులతో విరుచుకుపడ్డారు.
జంధ్యాల హై హై నాయకా సినిమాలో కోట శ్రీనివాసరావు నోట్లో నుంచి వచ్చేది బూతులే. తన బస్సులు రెండు కాలిపోవడంపై ప్రెస్మీట్ పెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. బూతులతో విరుచుకుపడ్డారు. తాడిపత్రిలో బీజేపీ నేతలు డిసెంబర్ 31న కేవలం మహిళల కోసం కార్యక్రమాలు నిర్వహించారు. అలాంటి కార్యక్రమం చేయడంపై ఆయన విరుచుకుపడ్డారు. ఆ కాకర్యక్రమానికి వేల మంది మహిళలు వచ్చారు. ఇలాంటివి చేస్తే తానే చేయించాలి కానీ వాళ్లెవరు అన్నది ప్రభాకర్ రెడ్డి వాదన. అందుకే ఆయన విరుచుకుపడ్డారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఊడిపడటంతో ఆయనకు చెందిన రెండు బస్సులు కాలిపోయాయి. కానీ బీజేపీ నేతలే తగులబెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డిఆరోపించారు. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టి ఫిర్యాదు చేయడం లేదన్నారు. కావాలంటే బస్సులు ఇంకా ఉన్నాయి తగులబెట్టుకోవాలని చెప్పుకొచ్చారు.
విచిత్రం ఏమిటంటే ఆయనకు జగన్ మేలుగా అనిపించడం. జగన్ తన బస్సును ఆపాడు కానీ కాలబెట్టలేదని మీరు బస్సులు తగులబెడుతున్నారు కాబట్టి జగన్ మంచోడని చెప్పుకొచ్చారు. అదే సమయంలో జగన్ హయాంలో వంద కోట్లు నష్టపోయానని కూడా విరుచుకుపడ్డారు. మొత్తంగా జేసీ ప్రభాకర్ రెడ్డి నియంత్రణ కోల్పోతున్నారు. కుటుంబసభ్యులు చెప్పినా వినడం లేదు. ఆయన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి వయసు కారణంగా బయటకు రాలేని స్థితికి వెళ్లారు.