తెలంగాణాలో తనకి ఎదురు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ప్రతిపక్షాలని నిర్వీర్యం చేస్తున్న అధికార తెరాస ఈరోజు మరో అడుగు ముందుకు వేసి ప్రతిపక్ష పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డిపై భౌతిక దాడులకి ప్రయత్నించింది. మహబూబ్ నగర్ లో ఆర్&బి గెస్ట్ హౌస్ లో మరికొందరు భాజపా నేతలతో కలిసి ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహిస్తుండగా, తెరాస కార్యకర్తలు అక్కడికి చేరుకొని నాగం జనార్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోపలకి చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నించారు. వారిని భాజపా కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ పెరిగి ఒకరినొకరు కొట్టుకొనే పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉన్న పోలీసులు తెరాస కార్యకర్తలని అడ్డుకొని వారిలో కొందరిని అదుపులోకి తీసుకొన్నారు. తెరాస కార్యకర్తలు కిటికీ అద్దాలని పగులకొట్టారు.
తెలంగాణా ప్రాజెక్టులలో భారీగా అక్రమాలు, అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ నాగం జనార్ధన్ రెడ్డి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. దాని గురించే మాట్లాడేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, ఆయనని మాట్లాడనీయకుండా తెరాస కార్యకర్తలు అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఒకవేళ అక్కడ భాజపా కార్యకర్తలు, పోలీస్లు లేనట్లయితే వారు తప్పకుండా నాగం జనార్ధన్ రెడ్డిపై దాడి చేసి ఉండేవారే. అదృష్టవశాత్తు ఆయన త్రుటిలో వారి నుంచి తప్పించుకోగలిగారు. తను ప్రాజెక్టులలో జరుగుతున్న్ అవినీతి గురించి ప్రశ్నిస్తున్నాను తప్ప ప్రాజెక్టులని అడ్డుకోవడం లేదని, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు తనపై భౌతిక దాడులకి దిగి తెరాస ప్రభుత్వం తనను భయపెట్టాలని చూస్తోందని ఇటువంటివాటికి తానేమీ భయపడబోనని, తెరాస ప్రభుత్వంపై తన పోరాటం కొనసాగిస్తానని,” నాగం జనార్ధన్ రెడ్డి ప్రబుత్వాన్ని హెచ్చరించారు.