వైకాపా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం తన రాజీనామా లేఖని ఫ్యాక్స్ ద్వారా స్పీకర్ కోడెల శివప్రసాదరావుకి పంపించారు. తన నియోజకవర్గంలో అధికారులు, ప్రోటోకాల్ ని అసలు పట్టించుకోవడం లేదని, తనని అధికారిక కార్యక్రమాలకి ఆహ్వానించి ఎమ్మెల్యేనని కూడా చూడకుండా తన పట్ల చాలా అమర్యాదగా వ్యవహరిస్తున్నారని అందుకు నిరసనగానే రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు.
ప్రతిపక్షం పార్టీల ప్రజాప్రతినిధులకి తరచూ ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. అయినా ఇటువంటి సమస్యలకి నిరసనగా రాజీనామా చేయడం మంచి పద్ధతి కాదు. మొసళ్ళున్న చెరువులో దిగే ముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. రాజకీయాలు కూడా అంతే! ఇటువంటి ఆటుపోటులన్నీ తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళే రాజకీయాలలో మనగలుగుతారు. కనుక ఇటువంటి కారణాలతో రఘురామ రెడ్డి రాజీనామా చేయడం కంటే తన రాజకీయ అనుభవంతో పరిస్థితులని తనకి అనుకూలంగా తిప్పుకొనే ప్రయత్నం చేసి ఉండి ఉంటే ఆయన గొప్పదనం అందరూ గుర్తించి ఉండేవారు. తను పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ముందుగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి తెలియజేయకపోయుంటే ఆయన వేరే ఉద్దేశ్యంతో ఈ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారని అనుమానించవలసి ఉంటుంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనకు అందిన ఆ రాజీనామా లేఖని ఆమోదించినా లేదా ఇదే అదునుగా తెదేపా నేతలు ఆయనని తమవైపు తిప్పుకొన్నా వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య మరొకటి తగ్గుతుంది.