ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానంగా ఎదుర్కొనే కొన్ని విమర్శలలో ఆయన విదేశీ పర్యటనలు కూడా ఒకటి. ఆయన సగటున నెలకొకసారి విదేశాలకి వెళ్లి వస్తుంటారు. ఆయన తరువాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ రెండేళ్లలో సింగపూర్, జపాన్, చైనా, అమెరికా తదితర దేశాలకి వెళ్లి వచ్చారు. ఆయన పర్యటనల ప్రధానోద్దేశ్యం రాష్ట్రానికి పెట్టుబడులు, కొత్తగా పరిశ్రమలు రప్పించడం. ఆశించిన ఫలితాలు మాత్రం రాకపోయినా, ప్రత్యేక విమానాలలో అధికారులని, మంత్రుల్ని వెంటబెట్టుకొని విదేశీపర్యటనలు చేసిరావడానికి రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోంది. నిన్ననే ఆయన బృందం చైనా పర్యటన ముగించుకొని విజయవాడ తిరిగి వచ్చింది. మళ్ళీ జూన్ 9న రష్యా ప్రయాణానికి సిద్దం అవుతున్నారు. అది కూడా పెట్టుబడుల కోసమే. యధాప్రకారం ఆయనతో ఒక డజను మంది బయలుదేరి వెళతారు. కనుక మళ్ళీ వారి యాత్రకి ఖజానాలో నుంచి ఒకటో రెండో కోట్లు తీసి ఖర్చుపెట్టక తప్పదు.
ముఖ్యమంత్రి రష్యా పర్యటన ఖరారు అయింది కానీ ఇంకా పూర్తి షెడ్యూల్ ఖరారు కావలసి ఉంది. ఒకటి రెండు రోజుల్లో ప్రకటించవచ్చు. దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి బహుశః ఇన్నిసార్లు అధికారికంగా విదేశీ పర్యటనలు చేసి ఉండరేమో?