ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే హైకోర్టు విభజన జరగకుండా ఉద్దేశ్యపూర్వకంగానే అడ్డుపడుతున్నారని నిజామాబాద్ ఎంపి కవిత ఆరోపించారు. “హైదరాబాద్ లో వేరే చోట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేసుకోవడానికి మా ప్రభుత్వం భవనాలను ఇవ్వడానికి సిద్దంగా ఉన్నా చంద్రబాబు అంగీకరించడం లేదు. ఆయన అంగీకరించి ఉండి ఉంటే కేంద్రప్రభుత్వం తక్షణమే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో రాష్ట్రపతి చేత హైకోర్టు ఏర్పాటుకి నోటిఫై చేయించి ఉండేది. ఒకవేళ ఆయనకి హైదరాబాద్ లో హైకోర్టు ఏర్పాటు చేసుకోవడం ఇష్టం లేకపోతే ఏపిలోనే ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అదీ చేయడంలేదు. ఆంధ్రా కోసం పనిచేయవలసిన న్యాయమూర్తులు తెలంగాణాలో పనిచేయాలనుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. వారి నియామకాల వెనుక కూడా రాజకీయ కుట్ర దాగి ఉంది. తెలంగాణా న్యాయస్థానాలలో ఆంధ్రా న్యాయమూర్తులని నియమించి వారి ద్వారా చంద్రబాబు తెలంగాణాపై పెత్తనం చేలాయించాలని ప్రయత్నిస్తున్నారు. మేము 15ఏళ్ళు పోరాడి తెలంగాణా సాధించుకొన్నాము. అయినా ఇంకా ఆంధ్ర పాలకులు మాపై ఏదోవిధంగా పెత్తనం చెలాయించాలనే చూస్తున్నారు. తెదేపా, భాజపాలు మిత్రపక్షాలు కావడంతో రెండూ కలిసి చాలా తేలికగా పరిష్కరించదగ్గ ఈ సమస్యని చాలా జటిలంగా మార్చాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ అన్యాయాన్ని సహించలేకనే తెలంగాణా న్యాయవాదులు ఉద్యమించవలసి వచ్చింది,” అని కవిత అన్నారు.
ఈ విషయంలో చంద్రబాబుది ఎంత తప్పు ఉందో, కెసిఆర్ ది కూడా అంతే తప్పు ఉందని చెప్పక తప్పదు. హైకోర్టు విభజనకి వీలు కల్పిస్తూ విభజన చట్టంలోని సెక్షన్:30ని సవరించమని కోరుతూ తెలంగాణా శాసనసభలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఉంటే, ఆ తీర్మానంపై కేంద్రం తప్పనిసరిగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చేది. కానీ రెండేళ్ళలో తెరాస ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేదు? అంటే ఈ సమస్య రావణకాష్టంగా రగులుతున్నంత కాలం తెలంగాణా ప్రజలలో సెంటిమెంటు రెచ్చగొట్టడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే తెరాస ప్రభుత్వం అటువంటి ప్రయత్నాలు చేయలేదని తెదేపా నేతలు వాదిస్తున్నారు. అందుకే గట్టి ప్రయత్నాలు చేయకుండా మొక్కుబడిగా కేంద్రానికి లేఖలు వ్రాసి తన ప్రయత్నా లోపమేమీ లేదన్నట్లు మాట్లాడుతున్నారని తెదేపా నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సెక్షన్: 30 సవరణకి చంద్రబాబు అభ్యంతరం చెప్పినట్లయితే అప్పుడు హైకోర్టు విభజనకి ఆయనే అడ్డుపడుతున్నారని నిరూపించబడేది కదా! కనుక అందరూ రాజకీయాలను పక్కన బెట్టి ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేసి హైకోర్టు విభజన చేయడం మంచిది. అదే అందరికీ మంచిది.