తెలంగాణ ప్రభుత్వానికీ, సినిమా పరిశ్రమకు ఉన్న టర్మ్స్ అంతంత మాత్రమే అన్నది జగమెరిగిన సత్యం. మధ్యలో దిల్ రాజు సర్దుబాటు యత్నాలు ఎన్ని చేసినా ఫలితం కనిపించడం లేదు. పైకి రేవంత్ రెడ్డి వ్యవహారం ‘ఓకే.. ఓకే’ అన్నట్టు ఉన్నా, లోలోపల మాత్రం ‘సినిమా’ పేరెత్తితే మండి పడుతున్నట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు సంక్రాంతి టికెట్ రేట్ల ఇష్యూ అందుకు మరింత ఊతాన్ని ఇస్తోంది.
సంక్రాంతి అంటేనే పెద్ద సినిమాల సీజన్. పెద్ద సినిమా రిలీజ్ అవుతోందంటే కచ్చితంగా సినిమా రేట్లు పెంచమంటూ నిర్మాతలు ప్రభుత్వాన్ని విన్నవించుకొంటారు. ప్రభుత్వం కూడా.. అందుకు వెసులుబాటు ఇస్తూ వస్తోంది. అయితే ‘పుష్ప 2’ ఇష్యూలో ప్రభుత్వం సినిమా రంగాన్ని, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల విషయాన్నీ చాలా సీరియస్గా తీసుకొంది. ఇష్టమొచ్చినట్టు రేట్లు పెంచేది లేదని స్పష్టం చేసింది. అందుకే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న నిర్మాతలు సైతం టికెట్ రేట్లు పెంచమని ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం కూడా మానేశారు.
నిర్మాత నాగ వంశీ ‘నైజాంలో ప్రస్తుతం ఉన్న రేట్లు చాలు. ఇక పెంచాల్సిన అవసరం లేదు’ అని చెప్పేశారు. ప్రభుత్వాన్ని ఈ విషయంలో రిక్వైస్ట్ కూడా చేరని తేల్చేశారు. ఏపీ రేట్లకూ, తెలంగాణ రేట్లకూ తేడా లేదు. అలాంటప్పుడు ఏపీలో పెంచి, తెలంగాణలో పెంచకపోతే తేడా కనిపిస్తుంది. ఏపీలో రేట్లు పెంచమని ఆర్జీ పెట్టుకొని, తెలంగాణలో పెట్టకపోవడానికి కారణం ఏమిటి? తెలంగాణలో ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లకు ఓకే అన్నప్పుడు ఆంధ్రాలో ఎందుకు ఓకే కాదు. రెండు చోట్ల రెండు వేర్వేరు రేట్లు ఎందుకు? తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమన్నా, పెంచే అవకాశం లేదని నాగవంశీ డిసైడ్ అయిపోయారా? అందుకే ఆయన సైలెంట్ గా ఉండిపోతారా? అనే చర్చ టాలీవుడ్ లో నడుస్తోంది. మరోవైపు దిల్ రాజు మాత్రం ‘గేమ్ ఛేంజర్’ రేట్లు పెంచుకోవడానికి తన శక్తి మేరకు కృషి చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ రేట్లు పెంచుకొని, మిగిలిన రెండు సినిమాలకూ మామూలు రేట్లే ఉంటే.. అప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ ఎలా వుంటుంది? వాళ్ల అడుగులు ఎటువైపు పడతాయి? ఒక సినిమాకు పెంచి, మరో సినిమాకు పెంచకపోతే బాగోదు కనుక… మూడు సినిమాల విషయంలోనూ ప్రభుత్వం ఓకే రూల్ అప్లై చేస్తుందా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే.
ప్రభుత్వ వైఖరి చూసిన నిర్మాతలు.. ఈ ప్రభుత్వాన్ని బతిమాలుకోవడం ఎందుకూ అని లైట్ తీసుకొంటే మాత్రం భవిష్యత్తులో ప్రభుత్వానికీ, చిత్ర సీమకూ ఈ దూరం మరింత పెరిగే ప్రమాదం వుంది.