విచారణలో ధర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారన్న అనుమానాలను కేటీఆర్ తరపు లాయర్ వ్యక్తం చేయడంతో ఏసీబీ విచారణకు లాయర్ హాజరయ్యేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే విచారణను దూరం నుంచి చూసేందుకు మాత్రమే అంగీకరించింది. ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీలో కేటీఆర్ లాయర్ కూర్చుని అక్కడి నుంచి చూడవచ్చు. అయితే విచారణలో ఏం అడుగుతున్నారు.. ఏం చెబుతున్నారని లాయర్ కు తెలిసే అవకాశం ఉండదు. హైకోర్టు ఉత్తర్వులతో కేటీఆర్కు పాక్షిక విజయం లభించినట్లయింది.
తమ పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు పోలీసులు తప్పుడు స్టేట్ మెంట్ రాసుకున్నారని దాన్ని మీడియాలో ప్రచారం చేశారని కేటీఆర్ అంటున్నారు. అలా తన విషయంలోనూ రాసుకుంటారని..అందుకే లాయర్ సమక్షంలో విచారణ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అది తన రాజ్యాంగపరమైన హక్కు అంటున్నారు. అందుకే ఇటీవల ఆయన ఏసీబీ ఆఫీసు వరకూ వెళ్లినా లాయర్ ను అనుమతించలేదని తిరిగి వచ్చేశారు. దీంతో ఏసీపీ 9వ తేదీన మళ్లీ విచారణకు రావాలని.. ఈ సారి కూడా ఎలాంటి లాయర్లను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఈ కారణంగా కేటీఆర్ విచారణకు ముందు రోజు.. హైకోర్టును ఆశ్రయించి విచారణను లాయర్ చూసే అవకాశం పొందారు.
కేటీఆర్ తరపు లాయర్.. విచారణలో అవినాష్ రెడ్డి కేసును ప్రస్తావించారు. ఇదే హైకోర్టు అవినాష్ రెడ్డిని లాయర్ సమక్షంలో ప్రశ్నించాలని ఉత్తర్వులు ఇచ్చిందని కేటీఆర్ లాయర్ వాదించారు. అయితే అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని.. ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని మాత్రమే చెప్పామని .. ఆ ఉత్తర్వుల్ని చూశారా అని కోర్టు కేటీఆర్ లాయర్ ను ప్రశ్నించారు. విచారణలోకి లాయర్ ను అనుమతించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. గురువారం కేటీఆర్ ఏసీబీ ఎదుట తన లాయర్ తో విచారణ కావడం ఖాయంగా కనిపిస్తోంది.