తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మిసన్ కాకతీయకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. చిన్ననీటి వనరులైన చెరువులకు పునరుజ్జీవం కల్పించడం ద్వారా గ్రామీణ తెలంగాణ రూపు రేఖలను మార్చడం మిషన్ కాకతీయ ఉద్దేశం. ఈ ప్రాజెక్టుకు 5 వేల కోట్ల రూపాయల సాయం అందించాలని అరుణ్ జైట్లీని కేసీఆర్ కోరారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. వేలాది చెరువులు రూపురేఖలు లేకుండా పోయాయి. ఒకప్పుడు చెరువుల కింద సాగుతో కళకళలాడిన పొలాలు బీళ్లుగా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెరాస ప్రభుత్వం కొలువుదీరగానే చెరువులపై దృష్టిపెట్టింది. గత ఏడాది మార్చి 12న మిషన్ కాకతీయ పేరుతో బృహత్తర పథకానికి శ్రీకారం చట్టింది.
తెలంగాణలోని 45 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించడం, నీటి నిల్వకు అనుగుణంగా తీర్చిదిద్దం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. 20 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేట్టారు. దీనికి కేంద్రం నుంచి 5 వేల కోట్ల సాయం అందితే రాష్ట్ర ఖజానాపై భారం తగ్గుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. మిషన్ కాకతీయ అద్భుత పథకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. నీతి ఆయోగ్ కూడా ఈ పథకానికి సాయం కోసం సిఫార్సు చేసిందని కేసీఆర్ తన లేఖలో గుర్తు చేశారు.
మిషన్ కాకతీయకు ఆర్థిక సహాయంతో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కూడా కేసీఆర్ తన లేఖలో అరుణ్ జైట్లీని కోరారు. వెనుకబడిన జిల్లాల ప్రగతికి కేంద్రం చేయూతనివ్వాలని విభజన చట్టం కూడా సూచిస్తోంది. కేసీఆర్ లేఖకు కేంద్ర మంత్రి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఆర్థిక సహాయం అవసరమే అని నిర్ణయిస్తారో లేక మరో విధంగా స్పందిస్తారో చూద్దాం.