ఈ సంక్రాంతికి మూడు సినిమాలున్నాయి. వాటిపై అంచనాలూ ఉన్నాయి. అయితే ప్రమోషన్ల విషయంలో ఏదో వెలితి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ కాస్త హడావుడి చేస్తున్నారు. మిగిలిన రెండు సినిమాల్లో అంత ఊపు లేదు. ‘గేమ్ ఛేంజర్’ పాన్ ఇండియా సినిమా. తెలుగు నాట ప్రమోషన్ చేయకపోయినా ఫర్వాలేదు. కానీ నార్త్ లో పబ్లిసిటీ చాలా అవసరం. ఈ విషయంలో దిల్ రాజు అండ్ టీమ్ సరైన ఎఫెక్ట్ పెట్టలేదు. ఆమధ్య నార్త్ లో ఓ చిన్న ప్రెస్ మీట్ పెట్టారు. పెద్దగా ఉపయోగపడలేదు. ఇటీవల ముంబైలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. అదీ.. తూ-తూ మంత్రంగానే సాగింది. అంతకు మించిన ఈవెంట్ ఏం జరగలేదు. చెన్నైలో కొద్దో గొప్పో ప్రమోషన్ చేయాల్సింది. కానీ ఇంత వరకూ ఆ దిశగా ఆలోచించలేదు.
సంక్రాంతి హీరోలు కూడా మీడియాకు దూరంగా ఉన్నారు. రామ్ చరణ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. బాలకృష్ణ కూడా అంతే. ఓ కామన్ ఇంటర్వ్యూ ఒకటి చేసి, చేతులు దులుపుకొన్నారు. ‘డాకూ మహారాజ్`కు సంబంధించి రెండు మూడు ప్రెస్ మీట్లు నిర్వహించారు. అందులో బాలయ్య కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంతపురంలో జరుగుతుంది. అక్కడికి బాలయ్య ఎలాగూ వస్తాడు. దాంతో.. ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయిపోతాయి. వెంకటేష్ పబ్లిసిటీ విషయంలో చొరవ చూపిస్తున్నా, పర్సనల్ ఇంటర్వ్యూలు ఇచ్చే విషయంలో మొహమాటపడుతున్నాడని టాక్. మీడియా విస్త్రృతంగా పెరిగిపోయింది. ఒకరికి ఇంటర్వ్యూ ఇచ్చి, మరొకరికి ఇవ్వకపోతే అదో గోల. అందుకే ప్రింట్ మీడియా వరకూ టచ్ చేసి, వదిలేద్దాం అనుకొంటున్నార్ట.
సాధారణంగా సంక్రాంతి అనగానే వచ్చే సినిమాలు పోటా పోటీగా పబ్లిసిటీ చేస్తాయి. రోజుకో ఈవెంట్ జరుగుతుంటుంది. అయితే ఈసారి అలాంటి హంగామా కనిపించకపోవడం కాస్త నిరాశే.