ఇక కార్యకర్తలను గొప్పగా చూస్తామని .. ఈ విషయంలో తాము నేర్చుకోవాల్సింది ఉందని జగన్ రెడ్డి .. తన రైటర్ రాసినచ్చిన స్క్రిప్టును నెల్లూరు నేతల ముందు చదివి వినిపించారు. అంటే ఆయన లెక్క ప్రకారం కార్యకర్తల్ని అధికారంలో ఉన్న పదేళ్ల పాటు సరిగ్గా చూసుకోనట్లే. ఆయన ఓదార్పుయాత్ర చేసిన దగ్గర నుంచి అధికారంలోకి వచ్చే వరకూ.. పది .. పన్నెండేళ్ల పాటు నానా తిప్పలు పడిన కార్యకర్తల్ని అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచి వాలంటీర్లు అంటూ.. వారికే పెత్తనం ఇచ్చారు. పోనీ కార్యకర్తల్ని అలా వారి మానాన వారిని వదిలేశారా అంటే.. పనులు ఇచ్చి ..చేయించి బిల్లులు ఎగ్గొట్టేశారు. ఫలితంగా ఆర్థికంగా కుదేలైపోయారు.
పదేళ్లు పార్టీ కోసం కష్టపడిన అజయ్ అమృత్ లాంటి వారిని బాది బాది పక్క పార్టీలకు పోయేలా చేశారు. చివరికి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఇలాంటివి ఎన్నో తప్పుడు ఉదాహరణలు ఉన్నాయి. అధికారంలో ఉన్నంత కాలం కన్నుమిన్నూ కానరాలేదు. కానీ ఇప్పుడు అధికారం పోయే సరికి కార్యకర్తలు గుర్తుకు వచ్చారు. ఇక నుంచి గొప్పగా చూస్తామన్నారు. ఓ సారి నమ్మకం, విశ్వసనీయత పోగొట్టుకున్నా సొంత కార్యకర్తలు ఎలా నమ్ముతారు?. అదీ కూడా అంతా అనుభవించేసిన తర్వాత మళ్లీ తమ అధికారానికి నిచ్చెనగా వాడుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేశారని సులువుగానే అర్థమవుతుంది.
జగన్ రెడ్డికి పార్టీ కార్యకర్తలు, నేతలు అంటే.. తన ఇమేజ్ ను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడానికి వస్తారని.. రౌడీలు, నేరగాళ్లు తమను పోలీసులు, చట్టం నుంచి రక్షించుకోవడానికివస్తారని అనుకుంటారు. అదే వారికి తాను చేస్తున్న ప్రయోజనం అని భావిస్తారు. అందుకే సామాన్యకార్యకర్తలను అసలు మనుషులుగా కూడా చూడరు. మోకాళ్ల దండాలు పెట్టించుకునేందుకు పనికి వచ్చే ఓ బ్యాచ్ గానే చూస్తారు. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలేదు.