దిల్‌రాజు.. మారుతి.. ఇద్దరి శైలి వేరు! అయితే ఇద్దరికీ మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. దిల్‌రాజు సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడతారు. మారుతికి సినిమా అంటే కుర్రకారుకి చెప్పలేనంత క్రేజ్. ఇవి రెండూ మిక్స్ అయితే ఎలా ఉండాలి? బాక్సాఫీసు దగ్గర ఆ సినిమా ఎలాంటి ప్రభావం చూపించాలి? కానీ రోజులు మారాయి సినిమా విషయంలో ఇదంతా తలకిందులైంది. మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించి.. నిర్మాతగానూ వ్యవహరించి.. దిల్‌రాజుతో చేతులు కలపి.. అబ్బో చాలా తతంగం జరిగింది. అటు దిల్‌రాజు టీమ్, ఇటు మారుతి టీమ్ ఇద్దరూ ఈ సినిమాకి తెగ ప్రమోషన్లు కల్పించారు. తీరా చూస్తే తుస్సుమంది.
రోజులు మారాయి… ఫ్లాప్ అవ్వడం వల్ల ఆర్థికంగా పెద్ద నష్టాలేం సంభవించకపోవొచ్చు. టాలీవుడ్ పరిశ్రమకి షాకిచ్చే ఫ్లాపూ కాదిది. కానీ… దిల్‌రాజు, మారుతి బ్రాండ్లకు మాత్రం ఘోరంగా దెబ్బడిపోయింది. మారుతి నిర్మాతగా ఇది వరకూ గట్టి షాకులే తిన్నాడు. ప్రేమ కథా చిత్రమ్ తరవాత.. తన చేయి వేసిన సినిమాలన్నీ ఫట్టు మన్నాయి. ఆ ప్రభావం మారుతిపై పడలేదు. అయితే ఈసారి మాత్రం అలా కాదు. బాబు బంగారంలాంటి స్టార్ హీరో సినిమాని పక్కన పెట్టుకొని రోజులు మారాయిపై దృష్టి పెట్టాడు. ఈ ఫ్లాప్.. బాబు బంగారంపై కొద్దో గొప్పో ప్రభావం చూపించే అవకాశం ఉంది. సేమ్ టూ సేమ్ దిల్‌రాజు పరిస్థితీ అంతే. తన బ్యానర్లో తీయబోయే చిన్న సినిమాలపై రోజులు మారాయి ఎఫెక్ట్ చాలానే ఉండబోతోంది. ఒక చిన్న సినిమా.. ఇద్దరి బ్రాండ్ ఇమేజ్‌లను కదిలించిందంటే… మామూలు విషయం కాదు. ఆ ఘనత ఈ సినిమాకే దక్కుతుంది.